-->

పూజ సమయంలో విషాదం.. రిటైర్డ్ ప్రిన్సిపాల్ మృతి

పూజ సమయంలో విషాదం.. రిటైర్డ్ ప్రిన్సిపాల్ మృతి


హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బేగంపేట ప్రాంతంలో పూజ చేస్తుండగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని రిటైర్డ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మీ (62) మృతి చెందారు.

లభ్యమైన వివరాల ప్రకారం, శ్యామ్‌లాల్ ప్రాంతానికి చెందిన విజయలక్ష్మీ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఇంట్లో ఒంటరిగానే నివసిస్తున్నారు. ప్రతిరోజు లాగే తెల్లవారుజామున పూజలో భాగంగా దీపం వెలిగిస్తుండగా, అనుకోకుండా ఆమె చీరకు నిప్పంటుకుంది.

మంటలు అంటుకున్న వెంటనే భయంతో ఆమె ఇంట్లో అటు ఇటు పరిగెత్తడంతో అగ్ని మరింత వ్యాపించింది. సోఫా, కర్టెన్లు, ఇతర ఫర్నీచర్‌కు మంటలు అంటుకోవడంతో ఇంట్లో పొగ నిండిపోయింది. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడటమే కాకుండా, పొగ కారణంగా ఊపిరాడక కుప్పకూలినట్లు తెలుస్తోంది.

ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే విజయలక్ష్మీ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793