కాటారం వేదికగా రేపు రెండో విడత రైతు భరోసా నిధులు!
హైదరాబాద్, ఏప్రిల్ 18: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కీలక ఉపశమనం కలిగించే రైతు భరోసా పథకం రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం కాటారం మండలం నస్తూరిపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ల్యాప్‌టాప్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.
రెండో విడతలో భాగంగా సుమారు 45,11,947 మంది రైతులకు రూ.2,063 కోట్లు జమ కానున్నాయి. ఈ కార్యక్రమం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం నుంచే నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇప్పటికే యాసంగి సీజన్‌కు సంబంధించి మార్చి 23న ఒక్కో ఎకరానికి రూ.6,000 చొప్పున సుమారు రూ.3,590 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.
ఇప్పుడు రెండో విడత కింద 36.72 లక్షల ఎకరాలకు చెందిన రైతులకు ఈ సాయం అందనుంది. రెండు విడతల్లో కలిపి రైతులకు మొత్తం రూ.5,653 కోట్ల పెట్టుబడి సహాయం అందుతున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది.
మూడో విడత నిధులను కూడా త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించి, అనంతరం కాటారం సభలో పాల్గొననున్నారు.

Post a Comment