వడగళ్ల బీభత్సం: తడిసిన ధాన్యం.. రైతన్న కంటనీరు
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవడంతో రైతులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు.
డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్‌పల్లి, సిరికొండ, మోపాల్ మండలాల్లో దాదాపు గంటపాటు కుండపోత వర్షం కురిసింది. ముఖ్యంగా ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వడగళ్ల వాన తీవ్రంగా పడటంతో చేతికొచ్చిన వరి పంట నేలమట్టమైంది. రాళ్ల వాన దెబ్బకు పొలాల్లోని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
తడిసిన ధాన్యం.. రైతుల ఆవేదన
అకాల వర్షాల కారణంగా ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తగినంత తార్పాలిన్లు లేకపోవడంతో ధాన్యం నీటిపాలైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులకు వరి చేనులు నేలకొరిగి, కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నష్టపోయాయి. గింజలు రాలిపోవడంతో దిగుబడి తీవ్రంగా దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు.
ప్రభుత్వం జోక్యం కోరుతున్న రైతులు
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని నిబంధనలతో కాకుండా వెంటనే కొనుగోలు చేయాలని, పంట నష్టానికి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు.
అకాల వర్షాల ప్రభావంతో రైతుల ఆశలు చెదిరిపోవడం, వారి జీవనాధారంపై మళ్లీ అనిశ్చితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది.

Post a Comment