ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తెలంగాణ సర్కార్.. రూ.2,000 కోట్ల విడుదల
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలలో తొలి విడతగా రూ.2,000 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసింది.
ఇటీవల ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి A. Revanth Reddy, ఉప ముఖ్యమంత్రి Bhatti Vikramarka Mallu ఉద్యోగుల సుదీర్ఘకాల బకాయిలలో రూ.6,000 కోట్లను 100 రోజుల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ అమలు దిశగా తొలి అడుగుగా రూ.2,000 కోట్ల నిధులను విడుదల చేశారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన రూ.4,000 కోట్ల బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది.
ఈ విడత నిధులతో ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన కీలక బకాయిలను పూర్తిగా క్లియర్ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిలను వంద శాతం చెల్లించగా, మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలను కూడా పూర్తిగా విడుదల చేసినట్టు వెల్లడించింది.
ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుందని అభినందిస్తున్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. “ఉద్యోగుల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రాధాన్యత. ఉద్యోగ జేఏసీకి ఇచ్చిన హామీ మేరకు బకాయిల చెల్లింపులు ప్రారంభించాం. మిగిలిన రూ.4,000 కోట్ల బకాయిలను కూడా పక్కా ప్రణాళికతో త్వరలోనే విడుదల చేస్తాం” అని తెలిపారు.

Post a Comment