TG ECET 2026 ఫలితాలు విడుదల.. 93.60% ఉత్తీర్ణత
తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG ECET 2026) ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది నిర్వహించిన పరీక్షలో మొత్తం 17,870 మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో 16,726 మంది అర్హత సాధించారు. దీంతో ఉత్తీర్ణత శాతం 93.60గా నమోదైంది.
మే 15న నిర్వహించిన TG ECET-2026 పరీక్షకు మొత్తం 18,626 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిప్లొమా హోల్డర్లు, బీఎస్సీ మ్యాథమెటిక్స్ విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష రాశారు.
టాప్ ర్యాంకర్లు వీరే
- సివిల్ ఇంజనీరింగ్‌లో కండ్లపెల్లి సంతోష్ మొదటి ర్యాంక్ సాధించారు.
- కంప్యూటర్ సైన్స్‌లో అస్మిత టాప్ ర్యాంక్ సాధించింది.
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో ఆకుల విష్ణుమూర్తి ఫస్ట్ ర్యాంక్ దక్కించుకున్నారు.
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బన్నీ మొదటి స్థానం సాధించారు.
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో గుణ సాయి గణేష్ టాప్‌లో నిలిచారు.
- మెకానికల్ ఇంజనీరింగ్‌లో నికిల్ కుమార్ మొదటి ర్యాంక్ సాధించారు.
- మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో పునీత్, మైనింగ్ ఇంజనీరింగ్‌లో సామల మహేశ్ ఫస్ట్ ర్యాంకులు సాధించారు.
అధికారుల వివరాల ప్రకారం రాష్ట్రంలో 179 ఇంజనీరింగ్ కాలేజీల్లో లాటరల్ ఎంట్రీ అడ్మిషన్ల కోసం సుమారు 21,200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫీజులు గత ఏడాది మాదిరిగానే కొనసాగుతాయని తెలిపారు. కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. జూలై మొదటి వారంలో తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ కోసం అవసరమైన వివరాలు:
- హాల్ టికెట్ నంబర్
- రిజిస్ట్రేషన్ నంబర్
- పుట్టిన తేదీ
అర్హత మార్కులు ఎంత?
TG ECET 2026లో ర్యాంక్ పొందేందుకు అభ్యర్థులు కనీసం 25 శాతం మార్కులు సాధించాలి. అంటే మొత్తం 200 మార్కులకు కనీసం 50 మార్కులు రావాలి.

Post a Comment