తిరుమలలో అంతర్రాష్ట్ర జేబుదొంగల ముఠా అరెస్ట్.. నకిలీ టీటీడీ ఐడీతో భక్తులకు టోకరా
తిరుమలలో అంతర్రాష్ట్ర జేబుదొంగల ముఠా అరెస్ట్.. నకిలీ టీటీడీ ఐడీతో భక్తులకు టోకరా
తిరుమలలో భక్తులను లక్ష్యంగా చేసుకుని జేబుదొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాంభగీచ కార్ పార్కింగ్ ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి నగదు, నకిలీ టీటీడీ గుర్తింపు కార్డు, సెల్‌ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన వారిలో బాలాజీ అకాడే (33), కీర్తి రెడ్డి (31), అప్పాషా మానే (65) ఉన్నారు. తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని బస్సు స్టాండ్లు, ఉచిత బస్సులు, ఇతర రద్దీ ప్రాంతాల్లో జేబుదొంగతనాలు, పర్సులు, బ్యాగులు కత్తిరించి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
విచారణలో నిందితుల మోసాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితురాలు కీర్తి రెడ్డి నకిలీ టీటీడీ ఉద్యోగి గుర్తింపు కార్డు తయారు చేసుకుని, తాను టీటీడీ ఉద్యోగినినని భక్తులను నమ్మించేదని పోలీసులు తెలిపారు. వీఐపీ దర్శనం, గదులు, ప్రత్యేక దర్శన టికెట్లు ఇప్పిస్తానని చెప్పి పలువురు యాత్రికుల నుంచి ఫోన్‌పే ద్వారా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు.
నిందితుల వద్ద నుంచి రూ.5,100 నగదు, దొంగిలించిన పర్సు, మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, నకిలీ టీటీడీ ఐడీ కార్డు, రెండు పోకో మొబైల్ ఫోన్లు, ఒక లావా కీప్యాడ్ ఫోన్, బ్యాగులు కత్తిరించేందుకు ఉపయోగించే కట్టర్, చిన్న కత్తి, బ్లేడ్‌లు, భక్తుల దృష్టి మరల్చేందుకు ఉపయోగించే గిల్ట్ నగలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, స్వాధీనం చేసుకున్న వస్తువులను చట్టపరంగా జప్తు చేసి నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తిరుమల పోలీసులు భక్తులకు కీలక సూచనలు చేశారు. దర్శనం, గదులు, ప్రత్యేక టికెట్లు ఇప్పిస్తామని చెప్పే అపరిచితులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరించారు. నగదు లేదా ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లించకుండా, టీటీడీ అధికారిక కౌంటర్లు, అధికారిక ఆన్‌లైన్ సేవలను మాత్రమే వినియోగించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా మోసానికి గురైనట్లు అనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment