మూడోసారి ఆడపిల్లేనని అక్రమ అబార్షన్.. తీవ్ర రక్తస్రావంతో మహిళ మృతి.. ఇద్దరు అరెస్ట్
మూడోసారి ఆడపిల్లేనని అక్రమ అబార్షన్.. తీవ్ర రక్తస్రావంతో మహిళ మృతి.. ఇద్దరు అరెస్ట్
జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మూడోసారి కూడా ఆడశిశువే అని చెప్పడంతో అక్రమంగా అబార్షన్ చేయించుకున్న మహిళ తీవ్ర రక్తస్రావానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన భాస్కర్ గౌడ్‌కు దేవరుప్పుల మండలం కొలుకొండ గ్రామానికి చెందిన శ్రావణి (35)తో వివాహమైంది. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భాస్కర్ గౌడ్ హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
శ్రావణి మూడోసారి గర్భం దాల్చడంతో కొంతకాలంగా తన తల్లిగారింట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె, ఆమె తల్లి శోభ కలిసి హనుమకొండలోని ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లగా, నిర్వాహకుడు ప్రవీణ్ గర్భంలోని శిశువు ఆడపిల్ల అని చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మరోసారి ఆడపిల్లే అని భావించి గర్భస్రావం చేయించాలని నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం కొలుకొండ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ రచ్చ శ్రావణ్ కుమార్ సహకారంతో జనగామలోని సంజయ్ నగర్‌కు చెందిన ప్రైవేట్ ఏఎన్ఎం అనసూయను సంప్రదించారు. ఈ నెల 21న అనసూయ తన ఇంట్లోనే శ్రావణికి అక్రమంగా అబార్షన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.
అబార్షన్ అనంతరం శ్రావణికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది.
భర్త భాస్కర్ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జనగామ పోలీసులు.. ఏఎన్ఎం అనసూయ, ఆర్ఎంపీ రచ్చ శ్రావణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అబార్షన్‌కు ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మృతురాలి తల్లి శోభ, గర్భంలోని శిశువు లింగాన్ని వెల్లడించినట్లు ఆరోపణలు ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు ప్రవీణ్ పరారీలో ఉన్నారని జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గర్భంలోని శిశువు లింగ నిర్ధారణ, అక్రమ గర్భస్రావం వంటి ఆరోపణలపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Post a Comment