నెరేళ్ల దాష్టీకం సిగ్గుతో తలదించుకునే ఘటన కల్వకుంట్ల కవిత
నెరేళ్ల దాష్టీకం సిగ్గుతో తలదించుకునే ఘటన.. బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి: కల్వకుంట్ల కవిత
సిరిసిల్ల, నెరేళ్ల: నెరేళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న గ్రామస్తులపై గతంలో జరిగిన పోలీసుల దాష్టీకం తెలంగాణ సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకునే సంఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఘటన జరిగి దాదాపు తొమ్మిదేళ్లు గడిచినా బాధ్యులైన పోలీసులపై, ధనదాహంతో అమాయకుల ప్రాణాలు తీసిన వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని ఆమె విమర్శించారు.
మంగళవారం నెరేళ్లలో థర్డ్ డిగ్రీ హింసకు గురై అనారోగ్యంతో ఇటీవల మరణించిన గంధం గోపాల్ కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. అనంతరం బాధితుడు బానయ్య నివాసానికి వెళ్లి హరీశ్ సహా ఇతర బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఈ ఘటన జరిగిన సమయంలో తాను కూడా ఆ పాలక కుటుంబంలో భాగస్వామిగా ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుని బాధితులకు క్షమాపణ చెబుతున్నానని కవిత పేర్కొన్నారు. పర్యాటకుల్లా వచ్చి పరామర్శించి వెళ్లిపోవడం కాదని, బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి
నెరేళ్ల బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అందలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. గంధం గోపాల్ కుటుంబం తొమ్మిదేళ్లుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. గోపాల్ కుటుంబంతో పాటు నెరేళ్ల బాధితులందరికీ ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రేవంత్, బండి సంజయ్, కేటీఆర్‌లపై ప్రశ్నలు
నెరేళ్ల ఘటనను రాజకీయంగా ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు బాధితులకు న్యాయం ఎందుకు చేయలేదని కవిత ప్రశ్నించారు. అలాగే బీజేపీ నేత బండి సంజయ్ తీసుకొచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ నివేదిక ఏమైందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కూడా బాధిత కుటుంబాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
మానవ హక్కుల కమిషన్ ఎస్పీపై చర్యలు తీసుకోవాలని సూచించినప్పటికీ, ఒక ఎస్సైపై మాత్రమే చర్యలు తీసుకుని మిగిలిన అధికారులను కాపాడుతున్నారని ఆమె ఆరోపించారు.
రాజకీయాలకు అతీతంగా బాధితులకు న్యాయం చేయాలి
నెరేళ్ల ఘటనపై రాజకీయాలు చేయకుండా అన్ని రాజకీయ పార్టీలు మానవత్వంతో ముందుకు వచ్చి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కవిత పిలుపునిచ్చారు. అవసరమైతే బాధితులతో కలిసి ఢిల్లీ వరకు వెళ్లి జాతీయ ఎస్సీ కమిషన్ నివేదికను సాధిస్తామని తెలిపారు. నెరేళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

Post a Comment