వచ్చే నెల 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
మే 22: దేశవ్యాప్తంగా ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను చేపడుతున్నట్లు ఈసీ వెల్లడించింది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 8 వరకు నామినేషన్ల దాఖలు అవకాశం ఉండగా, జూన్ 9న నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. జూన్ 11న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. జూన్ 18న పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జూన్ 20 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఈసీ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగు చొప్పున రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలపై రాజకీయంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య స్థానాల పంపకం పై దాదాపు అవగాహన కుదిరినట్లు సమాచారం.
ప్రస్తుతం వైసీపీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్‌ల రాజ్యసభ పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న నాలుగు స్థానాల్లో టీడీపీకి రెండు, జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటికే ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా టీడీపీ, జనసేనకు దక్కే స్థానాల్లో సామాజిక సమీకరణాలు, రాజకీయ ప్రాధాన్యతలు కీలకంగా మారనున్నాయి. బీజేపీ, జనసేన అభ్యర్థుల ఎంపికలో అనూహ్య నిర్ణయాలు వెలువడే అవకాశమున్నట్లు సమాచారం.

Post a Comment