టీచర్లకు కొత్త నిబంధనలు… హాజరుపై కఠిన చర్యలకు సిద్ధమైన విద్యాశాఖ
హైదరాబాద్, మే 4: రాష్ట్రంలో ఉపాధ్యాయులు మరియు విద్యాశాఖ సిబ్బంది హాజరు వ్యవస్థపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పాఠశాలల్లో సమయపాలన, క్రమశిక్షణ బలోపేతానికి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొంతమంది ఉపాధ్యాయులు తరచుగా ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారని, హాజరు నమోదుల్లోనూ అదే ప్రతిబింబిస్తున్నదని సమాచారం.
ఇకపై ఉద్యోగుల హాజరు విషయంలో సీరియస్‌గా వ్యవహరిస్తామని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ద్వారా హాజరు నమోదు తప్పనిసరి చేయగా, నెలవారీ హాజరు లెక్కింపులో దీన్నే ప్రామాణికంగా తీసుకోనున్నారు.
అలాగే సాయంత్రం 5 గంటల తర్వాతే కార్యాలయాన్ని విడిచి వెళ్లాలి. 4 గంటలలోపు వెళ్లినా, లేదా 4–5 గంటల మధ్య వెళ్లినా సెలవుగా పరిగణించి కోత విధిస్తారు. వరుసగా మూడు రోజులు ముందుగా వెళ్లినా ఒక సీఎల్‌గా నమోదు చేస్తారు.
ఇటీవల జోగుళాంబ గద్వాల జిల్లాలో 76 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం కూడా దీనికి సంకేతంగా భావిస్తున్నారు. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి చర్యలు కొనసాగుతున్నాయి.
విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి టీచర్లపై కూడా కఠిన హాజరు నిబంధనలు అమలు చేసే అవకాశం ఉందన్న చర్చ కొనసాగుతోంది.

Post a Comment