-->

తెలంగాణలో అకాల వర్షాలు.. ఈదురుగాలుల బీభత్సం

తెలంగాణలో అకాల వర్షాలు.. ఈదురుగాలుల బీభత్సం – వడగళ్ల వానతో పంటలకు నష్టం, పిడుగుపాటుకు రైతు మృతి


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అకాల వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రజలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం ఇచ్చినా, ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది.

నల్లగొండ జిల్లాలో ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. హాలియా–నల్లగొండ ప్రధాన రహదారిపై పలు చోట్ల చెట్లు విరిగిపడటంతో రాకపోకలు అంతరాయం కలిగాయి. అలాగే తిప్పర్తి మండలంలోని అద్దంకి–నార్కట్‌పల్లి హైవేపై చెట్లు కూలిపోవడంతో సుమారు అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.

నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన తీవ్ర నష్టం కలిగించింది. ఇక ఉమ్మడి వరంగల్, సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఐకేపీ కేంద్రం వద్ద పిడుగుపాటుకు ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అకాల వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపుల సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, చెట్ల కింద ఆశ్రయం పొందకూడదని హెచ్చరిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793