రేపటి నుంచి ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమం ప్రారంభం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం మే 14 నుంచి జూన్ 19 వరకు “ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం ఏ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.
బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 14న స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పేరెంట్స్-టీచర్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే మే 21న అంగన్‌వాడీ టీచర్లు, మదర్స్ కమిటీలతో సమావేశాలు నిర్వహించగా, మే 28న యువత, స్థానిక నాయకులతో చర్చలు జరపాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమం ద్వారా బడి ఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న చిన్నారులను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి తరగతిలో చేర్పించనున్నారు.
అదేవిధంగా బాల కార్మికులు, బడి మానేసిన పిల్లలు, ఇంకా పాఠశాలకు వెళ్లని చిన్నారులను గుర్తించి తిరిగి విద్యాబాట పట్టించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృషి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్థులను భాగస్వామ్యం చేసి ప్రతి పిల్లవాడిని పాఠశాలలో చేర్పించే లక్ష్యంతో ముందుకు సాగనున్నారు.
ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు అంగన్‌వాడీ టీచర్లతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ పాఠశాలల్లోనే అడ్మిషన్లు పెరిగేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు, ఇంగ్లీష్ మీడియం బోధన, నాణ్యమైన విద్య అందిస్తున్న నేపథ్యంలో ఈసారి ప్రవేశాలు మరింత పెరుగుతాయని విద్యాశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

Post a Comment