పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు
పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఏసీబీ వలలో అప్పటి ఇన్‌చార్జ్ ఎస్‌ఆర్‌వో మంద కిరణ్ కుమార్
పెద్దపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసిన అప్పటి ఇన్‌చార్జ్ ఎస్‌ఆర్‌వో, ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర ఇన్‌చార్జ్ ఎస్‌ఆర్‌వోగా విధులు నిర్వహిస్తున్న మంద కిరణ్ కుమార్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు.
2025 నవంబర్ 14న పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో, అప్పట్లో సీనియర్ అసిస్టెంట్ మరియు ఇన్‌చార్జ్ ఎస్‌ఆర్‌వోగా పనిచేసిన మంద కిరణ్ కుమార్, తన ప్రైవేట్ అసిస్టెంట్ బిట్టు అలియాస్ రత్నకుమార్ ద్వారా అక్రమంగా లంచాలు స్వీకరించినట్లు బయటపడింది.
2025 అక్టోబర్ 27 నుండి నవంబర్ 12 వరకు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా దరఖాస్తుదారుల నుంచి వసూలు చేసిన రూ.1,06,500ను యూపీఐ చెల్లింపుల రూపంలో స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
అధికారిక విధులను దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొందినట్లు తేలడంతో, ఏసీబీ అధికారులు 2026 మే 12న మధ్యాహ్నం 2:30 గంటలకు నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో మంద కిరణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం కరీంనగర్‌లోని ప్రత్యేక ఎస్పీఈ & ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.
లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదుల కోసం ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను ప్రజలు వినియోగించాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ / ట్విట్టర్ (@TelanganaACB) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ వెల్లడించింది.

Post a Comment