ఇద్దరు మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఆత్మహత్య
హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. మృతులు కృష్ణప్రియ, మాధురిగా గుర్తించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రజయ్ మెగా పోలీస్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న కృష్ణప్రియ (35) తన భర్త మైనేని మోనిల్ సింహతో కలిసి జీవిస్తోంది. దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తుండగా, వారికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కృష్ణప్రియ హైటెక్‌సిటీలో ఉద్యోగం చేస్తుండగా, భర్త కొంతకాలం బెంగళూరులో, మరికొంతకాలం హైదరాబాద్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. వేసవి సెలవుల కారణంగా భర్త, కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లగా, కృష్ణప్రియ ఒంటరిగా ఇంట్లో ఉంది.
సోమవారం సాయంత్రం కృష్ణప్రియకు ఆమె సోదరి పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో అపార్ట్‌మెంట్ వాచ్‌మన్‌కు సమాచారం ఇచ్చింది. అతను ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి చూడగా, కృష్ణప్రియ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, తెలంగాణ పోలీస్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇక మరో ఘటనలో, విజయనగరం జిల్లా నల్లబెల్లి గ్రామానికి చెందిన మాధురి (35) కూడా ఆత్మహత్యకు పాల్పడింది. 12 ఏళ్ల క్రితం సత్యనారాయణతో వివాహం అయిన మాధురి, మియాపూర్ మదీనాగూడలోని మైత్రీనగర్ ఫేజ్-2లో నివాసముంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆరు నెలల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న మాధురి, అప్పటి నుంచి కుమారుడితో కలిసి ఉంటోంది.
ఐదు రోజుల క్రితం మాధురి తల్లిదండ్రులు మనుమడిని తీసుకుని స్వగ్రామానికి వెళ్లారు. సోమవారం ఉదయం నుంచి తండ్రి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో, ఇంటి పక్కనున్న వ్యక్తిని ఇంటికి వెళ్లి చూడమని కోరాడు. అతను కిటికీ నుంచి చూడగా, మాధురి బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే మాధురి మృతి చెందినట్లు గుర్తించారు.
ఈ రెండు ఘటనల వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment