కూరగాయల సంచుల్లో గంజాయి.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
పటాన్‌చెరు, మే 12: ఎవరికీ అనుమానం రాకుండా కూరగాయల సంచుల్లో గంజాయి దాచిపెట్టి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ ఎస్‌వోటీ, పటాన్‌చెరు పోలీసులు సంయుక్తంగా సోమవారం పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.2 కోట్ల విలువైన 400 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ శ్రీనివాస్‌రావు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని సోలాపూర్, పండర్‌పూర్ ప్రాంతాలకు చెందిన ప్రతాప్ హరిదాస్ పవార్, ఆనంద్ మయప్ప, బాలాజీ గణేశ్, రోహిత్ హోవాల్, చందన్ షిప్వే ఆడుంబర్, చందాశివే సాహిల్, రంజీత్ గడాగే తదితరులు ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతం నుంచి గంజాయిని సేకరించి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు.
గంజాయిని డీసీఎం వ్యాన్‌లో కూరగాయల లోడ్‌లా కనిపించేలా సంచుల్లో ప్యాక్ చేసి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కూకట్‌పల్లి, పటాన్‌చెరు పోలీసుల సహకారంతో ఎస్‌వోటీ పోలీసులు ముత్తంగి వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో కూరగాయల సంచుల్లో దాచిన 400 కిలోల ఎండు గంజాయి బయటపడింది. గంజాయి రవాణాకు ఉపయోగించిన డీసీఎం వాహనంతో పాటు ఎస్కార్ట్‌గా వినియోగించిన మరో కారు, ఆరు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు, మరో ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

Post a Comment