మండే ఎండలకు పశువులు, పక్షులు విలవిల..!
కరీంనగర్ జిల్లా: మే 23: తెలంగాణ రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి భగభగలకు పలు ప్రాంతాల్లో వడదెబ్బల ఘటనలు నమోదవుతుండగా, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
కేవలం మనుషులే కాకుండా పశువులు, పక్షులు కూడా ఎండ తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. శనివారం మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాంతంలో మండే ఎండలకు ఓ రైతుకు చెందిన ఎద్దు మృతి చెందింది. తీవ్ర ఉష్ణోగ్రతలు, నీటి కొరత కారణంగానే ఆ పశువు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.
అలాగే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం బోర్నపల్లి శివారులో శుక్రవారం మధ్యాహ్నం ఎండ తీవ్రతను తట్టుకోలేక పలుచోట్ల రామచిలుకలు రోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోయాయి. వాటిలో కొన్ని ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, పశువులు, పక్షులకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో చెట్ల వద్ద, ఇళ్ల ముందూ నీటి పాత్రలు ఉంచితే పక్షులకు ప్రాణాధారం అవుతుందని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.

Post a Comment