కల్తీ ఆహార మాఫియాపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం.. 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల నూనె స్వాధీనం
చార్మినార్‌లో కల్తీ ఆహార మాఫియాపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం.. 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల నూనె స్వాధీనం
హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న కల్తీ ఆహార వ్యాపారులపై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్) మరోసారి ఉక్కుపాదం మోపింది. చార్మినార్ ప్రాంతంలోని అక్రమ ఫాస్ట్ ఫుడ్ గోడౌన్‌పై నిర్వహించిన ఆకస్మిక దాడిలో భారీ మొత్తంలో కల్తీ ఆహార పదార్థాలు, పాత వంటనూనెను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ లాడ్‌బజార్, పంచ్ మొహల్లాలో ఉన్న "అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్"లో హెచ్-ఫాస్ట్ బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను తయారు చేసి నిల్వ ఉంచుతున్నట్లు గుర్తించారు.
తనిఖీల్లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్ లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు, నిషేధిత కృత్రిమ రంగులు వినియోగిస్తున్నట్లు, పలుమార్లు ఉపయోగించిన వంటనూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే నీటి నాణ్యత ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం, పరిశుభ్రత ప్రమాణాలను పాటించకపోవడం, పురుగుల నివారణ చర్యలు చేపట్టకపోవడం వంటి తీవ్ర ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
దాడిలో సుమారు 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల వంటనూనెతో పాటు కృత్రిమ రసాయన రంగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు విక్రయిస్తున్న ఆహారం ఆరోగ్యానికి హానికరమని నిర్ధారించిన అనంతరం సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
అధికారుల హెచ్చరిక ప్రకారం, ఇటువంటి కల్తీ ఆహార పదార్థాల వినియోగం వల్ల ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు, జీర్ణాశయ వ్యాధులు, కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ప్రజలు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ కలిగిన ఆహార విక్రయ కేంద్రాల నుంచే ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని, అనుమానాస్పద ఆహార పదార్థాలు లేదా కల్తీ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు.

Post a Comment