-->

తెలంగాణలో మద్యం ధరలు పెంపు దిశగా అడుగులు.. జూన్ 15 నుంచి కొత్త ధరలు

తెలంగాణలో మద్యం ధరలు పెంపు దిశగా అడుగులు.. జూన్ 15 నుంచి కొత్త ధరలు

తెలంగాణలో మద్యం ధరలు పెంపు దిశగా అడుగులు.. జూన్ 15 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు షాక్ తగలనుంది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. లిక్కర్ తయారీ కంపెనీల విజ్ఞప్తులు, ముడిసరుకుల ధరల పెరుగుదల, రవాణా ఖర్చుల భారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరల సవరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కొత్త ధరలు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మద్యం ధరల పెంపుపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో త్రిసభ్య కమిటీని నియమించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ కిషోర్ జైస్వాల్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సునీల్ శర్మ, చార్టర్డ్ అకౌంటెంట్ నవీన్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.

గత మూడు రోజులుగా కమిటీ మద్యం తయారీ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వివిధ అంశాలపై చర్చించింది. శుక్రవారంతో ఈ చర్చలు ముగిశాయి. మద్యం ధరలను 10 నుంచి 15 శాతం వరకు పెంచాలని తయారీ సంస్థలు కమిటీకి సూచించినట్లు సమాచారం.

అయితే కమిటీ రాష్ట్రంలో గతంలో జరిగిన ధరల పెంపు, ముడిసరుకుల వ్యయం, ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న ధరలు వంటి అంశాలను పరిశీలించిన అనంతరం తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల సాధారణ బ్రాండ్ల ఫుల్ బాటిళ్లపై గరిష్ఠంగా రూ.80 వరకు, ప్రీమియం బ్రాండ్లపై రూ.90 వరకు, హైఎండ్ లేదా ఖరీదైన బ్రాండ్లపై రూ.120కుపైగా ధరలు పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

కమిటీ తన నివేదికను తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ప్రతినిధులతో చర్చించిన అనంతరం ధరల పెంపు ఫైల్‌ను రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి పంపనుంది. అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలిపితే కొత్త ధరలు అధికారికంగా అమల్లోకి రానున్నాయి.

ఇదిలా ఉండగా, బీర్ల ధరలను కూడా పెంచాలని లిక్కర్ కంపెనీలు కోరినప్పటికీ కమిటీ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. గత ఏడాది ఫిబ్రవరిలోనే బీర్ల ధరలు పెంచినందున ప్రస్తుతం మరోసారి పెంపు అవసరం లేదని కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఈ దఫా బీర్ల ధరలు యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్ షాపులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మద్యం ధరల పెంపు అమల్లోకి వస్తే ప్రభుత్వానికి నెలకు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వార్షికంగా ఇది రూ.2,400 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు చేరవచ్చని అధికారులు భావిస్తున్నారు.

అయితే కొత్త ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయన్న విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మద్యం తయారీ సంస్థలు తమ వర్గాల్లో జూన్ 15 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ప్రచారం చేస్తున్నప్పటికీ, అసోసియేషన్లతో మరోసారి సమావేశమైన తర్వాతే తుది తేదీని ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793