కేంద్రం మరో బిగ్ షాక్..! ఉజ్వల లబ్ధిదారులకు ఇక ఏడాదికి 4 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లే
కేంద్రం మరో బిగ్ షాక్..! ఉజ్వల లబ్ధిదారులకు ఇక ఏడాదికి 4 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లే
న్యూఢిల్లీ, జూన్ 9: పెరుగుతున్న ఎల్పీజీ ధరల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు ఏడాదికి అందించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 4కు తగ్గించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు ఒక్కో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ అందుతోంది. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఏడాదిలో మొదటి నాలుగు రీఫిల్లులకే ఈ సబ్సిడీ వర్తించనుంది. దీంతో ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి గరిష్టంగా రూ.1,200 వరకు మాత్రమే సబ్సిడీ లభించనుంది.
ఉజ్వల పథకం 2016లో ప్రారంభమైనప్పుడు లబ్ధిదారులకు ఏడాదికి 12 సబ్సిడీ సిలిండర్లు అందించేవారు. అనంతరం ఆ సంఖ్యను 9కు తగ్గించగా, ఇప్పుడు మరింత తగ్గించి 4కు పరిమితం చేశారు. ఈ నిర్ణయం కోట్లాది ఉజ్వల లబ్ధిదారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు పెరగడం, ప్రభుత్వంపై సబ్సిడీ భారం అధికమవడం, ఉజ్వల కుటుంబాల సగటు వార్షిక వినియోగం నాలుగు నుంచి ఐదు సిలిండర్ల మధ్యే ఉండటం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలు ఇటీవల పెరిగాయి. ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.942కు చేరగా, ఉజ్వల లబ్ధిదారులు సబ్సిడీ తర్వాత రూ.642 చెల్లిస్తున్నారు. ప్రాంతానుసారం ధరల్లో స్వల్ప మార్పులు ఉంటున్నాయి.
ప్రస్తుతం దేశంలో 10.5 కోట్లకు పైగా కుటుంబాలు ఉజ్వల పథకం ప్రయోజనాలు పొందుతున్నాయి.

Post a Comment