50 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబికి చిక్కిన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ
50 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబికి చిక్కిన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ
హైదరాబాద్, జూన్ 23: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) వి. నర్సింహులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కారు.
మంగళవారం సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఎస్‌ఐ నర్సింహులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసులో ఫిర్యాదుదారుడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు భవిష్యత్తులో వేధింపులకు గురి చేయబోనని చెప్పేందుకు రూ.1 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి తొలి విడతగా రూ.50 వేల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందిత అధికారి వద్ద నుంచి రూ.50 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అధికారిక విధులను నిర్వర్తించేందుకు అక్రమంగా లంచం డిమాండ్ చేసి స్వీకరించడం ద్వారా తన బాధ్యతలను నిజాయితీకి విరుద్ధంగా నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
ఈ కేసులో ఎస్‌ఐ నర్సింహులును అరెస్టు చేసి నాంపల్లిలోని ప్రత్యేక ఎస్‌పీఈ & ఏసీబీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రజాప్రతినిధులు లంచం డిమాండ్ చేసిన సందర్భాల్లో ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వేదికల ద్వారా కూడా తెలంగాణ ఏసీబీని సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ స్పష్టం చేసింది.

Post a Comment