నెల్లూరు రొట్టెల పండుగకు ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు
నెల్లూరు రొట్టెల పండుగకు ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు
నెల్లూరు నగరంలోని బారా షాహిద్ దర్గా వద్ద జూన్ 26 నుంచి 30 వరకు నిర్వహించనున్న ప్రసిద్ధ రొట్టెల పండుగ సందర్భంగా పోలీసులు విస్తృత ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ ఆజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, టౌన్ ఏఎస్పీ దీక్ష సూచనలతో నెల్లూరు సిటీ ట్రాఫిక్ విభాగం ప్రత్యేక రూట్ మ్యాప్, కట్ ఆఫ్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలను ప్రకటించింది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జూన్ 25 నుంచే ప్రత్యేక పార్కింగ్ విధానం అమల్లోకి తీసుకువచ్చారు. చెన్నై, గూడూరు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు అయ్యప్పగుడి, మినీ బైపాస్ మార్గం ద్వారా ఓ-మార్ట్ సమీపంలోని సైన్స్ పార్క్ లేదా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలపాల్సి ఉంటుంది.
విజయవాడ, కావలి, కడప, ఆత్మకూరు, బుచ్చి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ఎన్‌హెచ్-16 సమీపంలోని ఎస్‌వీజీఎస్ కాలేజ్ గ్రౌండ్‌లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. జొన్నవాడ మార్గం నుంచి వచ్చే వాహనాలు డీఎస్‌ఎన్ మినీ ఫంక్షన్ హాల్ ముందు, వెనుక ఉన్న పార్కింగ్ స్థలాలను వినియోగించాలి.
అలాగే రాపూరు, పొదలకూరు వైపు నుంచి వచ్చే వాహనాలను ప్రసార భారతి (ఆల్ ఇండియా రేడియో) కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాలకు మళ్లించనున్నారు. తిరుగు ప్రయాణంలో కూడా భక్తులు సూచించిన మార్గాల ద్వారానే వెళ్లాలని పోలీసులు సూచించారు.
భక్తుల సౌకర్యార్థం అన్ని పార్కింగ్ కేంద్రాల్లో బయో టాయిలెట్లు, తాత్కాలిక టెంట్లు, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు.
ఇక భద్రతా కారణాల దృష్ట్యా బట్వాడిపాలెం సెంటర్, డీఎస్‌ఆర్ జంక్షన్, పెట్రోల్ బంక్ జంక్షన్, పొదలకూరు రోడ్ జంక్షన్ ప్రాంతాల నుంచి దర్గా వైపు అనుమతి లేని వాహనాలకు ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. అలాగే రొట్టెల పండుగ సమయంలో దర్గా పరిసర ప్రాంతాల్లో ఇసుక ట్రాక్టర్లు, ట్రిప్పర్లు, లారీలు సహా భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు.
రొట్టెల పండుగ విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులు, సందర్శకులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Post a Comment