'బలగం' సినిమా సీన్ రిపీట్.. మటన్ ముక్కల కోసం పెళ్లి విందులో పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు
'బలగం' సినిమా సీన్ రిపీట్.. మటన్ ముక్కల కోసం పెళ్లి విందులో పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు
సూర్యాపేట, జూన్ 28: పెళ్లిళ్లు బంధాలను మరింత బలపరిచే వేడుకలు కావాల్సి ఉండగా, సూర్యాపేట జిల్లాలో జరిగిన ఓ వివాహంలో మాత్రం మటన్ ముక్కల కోసం జరిగిన గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. 'బలగం' సినిమాలో చూపించిన సన్నివేశాన్ని తలపించేలా ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని అనంతారం గ్రామంలో ఇటీవల ఓ వివాహ వేడుక జరిగింది. వివాహ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన భోజన విందుకు పెళ్లికొడుకు తరపు బంధువులు ఆలస్యంగా చేరుకున్నారు. అప్పటికే మటన్ కూర దాదాపు అయిపోవడంతో వారికి కోరుకున్న మురుసు బొక్కల ముక్కలు అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీంతో "సరిగా భోజనం వడ్డించడం లేదని" పెళ్లికూతురు తరపు బంధువులతో వారు వాగ్వాదానికి దిగారు. దీనికి ప్రతిగా, సమయానికి భోజనానికి రాకుండా ఆలస్యంగా వచ్చి ఇప్పుడు గొడవ చేయడం సరికాదని పెళ్లికూతురు బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మాటామాటా పెరగడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, అది చివరకు భౌతిక దాడులకు దారితీసింది. పెళ్లి మండపంలోనే పరస్పరం కొట్టుకోవడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన వివాహ వేడుక కాస్త రణరంగాన్ని తలపించింది.
ఘటన అనంతరం ఇరుపక్షాల వారు పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. స్థానిక ఎస్సై గోపికృష్ణ ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేవలం మటన్ ముక్కల విషయంలో మొదలైన చిన్న వివాదం పోలీస్ కేసుల వరకు వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బంధాలను బలోపేతం చేయాల్సిన పెళ్లి వేడుకలో ఇలాంటి ఘటన జరగడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment