-->

ఏండ్ల కొద్దీ ఒకే చోట ఉన్న అధికారులకు బదిలీలు తప్పవు: మంత్రి దామోదర రాజనర్సింహ

ఏండ్ల కొద్దీ ఒకే చోట ఉన్న అధికారులకు బదిలీలు తప్పవు: మంత్రి దామోదర రాజనర్సింహ

ఏండ్ల కొద్దీ ఒకే చోట ఉన్న అధికారులకు బదిలీలు తప్పవు: మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్: తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMSIDC)లో ఏండ్ల తరబడి ఒకే విభాగంలో కొనసాగుతున్న అధికారులను వెంటనే బదిలీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. పరిపాలనలో జవాబుదారీతనం ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించబోమని హెచ్చరించారు.

బుధవారం హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (CMS) పనితీరుపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మందులు, సర్జికల్స్, వైద్య పరికరాల కొనుగోళ్లలో పారదర్శకత పెంచేందుకు ప్రస్తుతం ఉన్న రెండు కమిటీలకు అదనంగా మరో మూడు కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే కొనుగోళ్ల ప్రక్రియపై ప్రతి నెలా సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేశారు.

డీఎంఈ, టీవీవీపీ ఆస్పత్రుల్లో జరుగుతున్న సివిల్ పనులు, వైద్య పరికరాల కొనుగోళ్లను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని సూచించారు.

మెడిసిన్ స్టోర్లకు సొంత భవనాలు

రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న 15 సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల కోసం శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మందుల సరఫరాను వేగవంతం చేసేందుకు ప్రస్తుతం ఉన్న రెండు సీఎంఎస్ కేంద్రాలకు అదనంగా మరో నాలుగు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు వైద్య పరికరాల్లో ఏకరూపత తీసుకురావడానికి "స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్ లిస్ట్" రూపొందించాలని సూచించారు.

హిమోఫిలియా రోగులకు ఉచిత మందులు

హిమోఫిలియా రోగులకు అవసరమైన మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, నీలోఫర్ ఆస్పత్రిల్లో అందుబాటులో ఉన్న "ఎమిసిజుమాబ్" ఇంజెక్షన్లను ఇకపై వరంగల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మరియు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిల్లో కూడా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ ఎండీ గౌరవ్ ఉప్పల్, ఈడీ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793