గాఢ నిద్రలో ప్రయాణికులు.. క్షణాల్లో మంటల్లో చిక్కుకున్న ట్రావెల్స్ బస్సు తప్పిన పెను ప్రమాదం
గాఢ నిద్రలో ప్రయాణికులు.. క్షణాల్లో మంటల్లో చిక్కుకున్న ట్రావెల్స్ బస్సు తప్పిన పెను ప్రమాదం
అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నప్పటికీ డ్రైవర్ అప్రమత్తతతో 35 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది.
వివరాల ప్రకారం, 35 మంది ప్రయాణికులతో బయల్దేరిన బస్సు మార్గమధ్యంలో భోజన విరామం అనంతరం తిరిగి ప్రయాణం ప్రారంభించింది. అనకాపల్లి జిల్లా పరిధిలోకి చేరుకున్న సమయంలో బస్సు ముందు భాగంలోని ఎడమ వైపు నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. వెంటనే బస్సులోని సేఫ్టీ అలారం మోగడంతో డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాడు.
అనంతరం బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ అత్యవసరంగా కిందకు దించగా, కొద్ది క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించి బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనపై అనకాపల్లి రూరల్ సీఐ మాట్లాడుతూ, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించకపోయి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగేదని పేర్కొన్నారు. బస్సు ఇంజన్ భాగంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని, చెన్నై వెళ్లాల్సిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Post a Comment