అర్చకులు, ఉద్యోగుల సమన్వయంతోనే పనులు విజయవంతం: మంత్రి కొండా సురేఖ
అర్చకులు, ఉద్యోగుల సమన్వయంతోనే పనులు విజయవంతం: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్: అర్చకులు, ఉద్యోగులు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతమవుతాయని కొండా సురేఖ అన్నారు.
దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (ఎస్‌ఐటీఏ)ను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనంతరం 12 ఏళ్ల తర్వాత ఎస్‌ఐటీఏను పునఃప్రారంభించడం సంతోషకర విషయమన్నారు. దేవాదాయ శాఖను సరికొత్త దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు ఎస్‌ఐటీఏ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.
ఆలయాల పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, సిబ్బందికి శిక్షణ అందించడం, ఆధునిక సాంకేతికతను అమలు చేయడం వంటి అంశాలపై అవసరమైన విధానాలు, శిక్షణా కార్యక్రమాలను ఎస్‌ఐటీఏ చేపట్టనుందని మంత్రి వెల్లడించారు.
అనంతరం దేవాదాయ శాఖలో 18 మంది ఉద్యోగులకు ‘ట్రాన్స్‌ఫర్ ఆఫ్ సర్వీస్’ కింద సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించగా, మరో 20 మంది ఉద్యోగులకు గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా (ఈవోలు) ప్రమోషన్లు మంజూరు చేశారు. వీరికి మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పదోన్నతి పత్రాలు అందజేశారు.
అలాగే పదవీ విరమణ చేసిన పలువురు ఉద్యోగులకు ‘అర్చక, ఉద్యోగుల సంక్షేమ నిధి’ ద్వారా అందే ఆర్థిక ప్రయోజనాల చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, అర్చకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Post a Comment