ఆస్తి కోసం కొడుకు కుట్ర.. వృద్ధ దంపతులకు న్యాయం చేసిన కలెక్టర్!
ఆస్తి కోసం కొడుకు కుట్ర.. వృద్ధ దంపతులకు న్యాయం చేసిన కలెక్టర్!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆస్తి వివాదం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వృద్ధ దంపతులకు చివరకు న్యాయం జరిగింది. 71 ఏళ్ల ఎంజం రమణారెడ్డి, ఆయన భార్య 66 ఏళ్ల చంద్రకళ తమ సొంత ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఏళ్ల తరబడి న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. అయితే నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ జోక్యంతో వారి సమస్యకు పరిష్కారం లభించింది.
మిర్యాలగూడ హౌసింగ్‌బోర్డు కాలనీలో నివసించే రమణారెడ్డి, చంద్రకళ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు అమెరికాలో స్థిరపడగా, కుమార్తె వివాహం చేసుకుని వేరే చోట నివసిస్తోంది. చిన్న కుమారుడు దయాకర్‌రెడ్డికి ఇప్పటికే నాలుగు ఎకరాల భూమిని ఇచ్చినట్లు దంపతులు తెలిపారు. అతని కుటుంబం జీవనోపాధి కోసం గ్రామంలోని తమ ఇంటిలో నివసించే అవకాశం కూడా కల్పించినట్లు పేర్కొన్నారు.
తమ జీవితకాల పొదుపులతో మిర్యాలగూడలో ఇల్లు నిర్మించుకున్న ఈ దంపతులు, పిల్లల చదువుల కోసం అంటూ దయాకర్‌రెడ్డి కుటుంబంతో కలిసి ఆ ఇంట్లో నివసించేందుకు అనుమతించారు. అయితే 2022 అక్టోబర్‌లో దయాకర్‌రెడ్డి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి, ఆ ఇంటిని తన భార్యకు విక్రయించినట్లు చూపించాడని వారు ఆరోపిస్తున్నారు. అనంతరం ఆరోగ్య సమస్యల కారణంగా తాము తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా, తమను బలవంతంగా బయటకు పంపించాడని వాపోయారు.
ఇంతటితో ఆగకుండా రైతుబంధు సాయం నిలిపివేయడం, తమ భూములను కౌలుకు తీసుకోకుండా గ్రామస్థులను బెదిరించడం, కట్న వేధింపులు, భూవివాదాలు వంటి తప్పుడు ఆరోపణలతో వివిధ కోర్టుల్లో మొత్తం 22 కేసులు పెట్టడం ద్వారా తమను మానసికంగా, ఆర్థికంగా వేధించాడని చంద్రకళ ఆరోపించారు. దీంతో కోర్టుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు.
వృద్ధ దంపతుల ఫిర్యాదులపై అధికారులు విచారణ జరిపి, 'తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంక్షేమ చట్టం–2007' కింద చర్యలు చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దయాకర్‌రెడ్డిపై కేసు నమోదు కాగా, తాజాగా కలెక్టర్ ప్రత్యేక అధికారాలను వినియోగించి ఇంటిని ఖాళీ చేయాలని ఆదేశించారు. దీంతో రమణారెడ్డి, చంద్రకళ దంపతులు తమ ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, రమణారెడ్డి ఇటీవల పక్షవాతానికి గురయ్యారు. పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, వృద్ధాప్య సమస్యల చికిత్స కోసం ప్రతి నెలా సుమారు రూ.15 వేల వరకు ఖర్చు అవుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం కుమార్తెతో పాటు అమెరికాలో ఉన్న పెద్ద కుమారుడు పంపుతున్న ఆర్థిక సహాయంతో జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించారు.
అయితే ఇంటిని తిరిగి పొందినప్పటికీ, గ్రామంలోని తమ మిగిలిన ఆస్తులపై కూడా చిన్న కుమారుడు కన్నేశాడనే భయం వారిలో ఇంకా కొనసాగుతోంది. గ్రామంలోని ఇంటి తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకుంటానంటూ బెదిరిస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ అంశాన్ని మరోసారి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
"మేము కష్టపడి సంపాదించిన ఆస్తులను చివరికి పిల్లలకే వదిలిపెడతాం. అయినా ఆస్తి కోసం మా కుమారుడు మమ్మల్ని ఇంతగా వేధించడం బాధ కలిగిస్తోంది" అంటూ రమణారెడ్డి, చంద్రకళ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన వృద్ధుల హక్కుల పరిరక్షణలో చట్టాల ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పింది.

Post a Comment