-->

తెలంగాణలో రేపు పల్స్ పోలియో కార్యక్రమం.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం

 

తెలంగాణలో రేపు పల్స్ పోలియో కార్యక్రమం.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం

తెలంగాణలో రేపు పల్స్ పోలియో కార్యక్రమం.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం

హైదరాబాద్, జూన్ 27: రాష్ట్రవ్యాప్తంగా జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పల్స్ పోలియో నిర్వహణపై ఉన్నతాధికారులతో సమగ్రంగా చర్చించారు.

రాష్ట్రంలోని 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని, ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. పోలియో బూత్‌లు, మొబైల్ బృందాలు, ఇంటింటి సర్వేలు ద్వారా ప్రతి చిన్నారిని గుర్తించి చుక్కలు అందించాలని అధికారులను ఆదేశించారు.

అధికారులు మంత్రికి వివరించిన ప్రకారం, జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పల్స్ పోలియో బూత్‌లలో చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు. అనంతరం జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మొదటి రోజు చుక్కలు వేయించుకోని చిన్నారులను గుర్తించి వారికి పోలియో డ్రాప్స్ అందజేయనున్నారు.

అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో అక్కడ జూలై 1న అదనంగా మరో రోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఆరోగ్యశాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొని కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రికి వివరించారు.

ప్రజలకు విజ్ఞప్తి: 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పిల్లల ఆరోగ్య రక్షణలో భాగస్వాములు కావాలని ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793