రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
ఖమ్మం, జూన్ 27: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం భానాపురం గ్రామపంచాయతీ పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.
ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం, ఫిర్యాదుదారు భానాపురం గ్రామంలో తన ఐదు కుంటల స్థలంలో నిర్మిస్తున్న ఒక గది రేకుల ఇంటికి భవన నిర్మాణ అనుమతి మంజూరు చేయడం, ఇంటి నంబర్ కేటాయించడం కోసం పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్ రూ.25,000 లంచం డిమాండ్ చేశాడు.
ఫిర్యాదు అందుకున్న ఏసీబీ ఖమ్మం రేంజ్ అధికారులు పక్కా ప్రణాళికతో ముదిగొండ మండలంలోని రైతు వేదిక సమీపంలో ఉచ్చుపన్ని, సురేష్ ఫిర్యాదుదారు నుంచి రూ.25,000 లంచం స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆయన వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగిగా తన అధికారిక విధులను దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొందేందుకు లంచం స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
నిందితుడిని అరెస్టు చేసి వరంగల్‌లోని అవినీతి నిరోధక శాఖ (SPE & ACB) ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారు వివరాలను గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు.
లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్: 9440446106 ద్వారా కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల పేరు, వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

Post a Comment