-->

సిర్పూర్ పేపర్ మిల్లులో వెరిఫికేషన్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి: కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్

సిర్పూర్ పేపర్ మిల్లులో వెరిఫికేషన్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి: కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్
 సిర్పూర్ పేపర్ మిల్లులో వెరిఫికేషన్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి: కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్

హైదరాబాద్, జూన్ 10: సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం వెరిఫికేషన్ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మిల్లు గేటు ముందు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల నేపథ్యంలో రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులతో ఉమ్మడి సమావేశం నిర్వహించారు.

జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ చంద్రశేఖర్, రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను నిర్వహించకుండా ఆలస్యం చేయడం సరికాదని, కార్మికుల ప్రజాస్వామ్య హక్కులను గౌరవిస్తూ వెంటనే వెరిఫికేషన్ ఎన్నికలు నిర్వహించాలని వారు కోరారు.

అలాగే, ఎన్నికల ప్రక్రియకు అడ్డంకిగా ఉన్న కోర్టు కేసును యాజమాన్యం వెంటనే వెనక్కి తీసుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల ద్వారా కార్మికుల మెజారిటీ మద్దతు పొందిన సంఘానికి గుర్తింపు కల్పించడం ద్వారా పరిశ్రమలో సుస్థిర కార్మిక సంబంధాలు నెలకొంటాయని వారు పేర్కొన్నారు.

సమావేశంలో సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే. మల్లికార్జున్, మాజీ కార్మిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, జేఏసీ నాయకులు మరియు వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన జేఏసీ నాయకులు, కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం మరియు యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కోరారు. వెరిఫికేషన్ ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని కార్మికుల ఆందోళనలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో సిర్పూర్ పేపర్ మిల్లు గేటు ముందు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను యథావిధిగా కొనసాగిస్తామని హెచ్చరించారు.

కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాటంలో పాల్గొనాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోలెం వెంకటేశం, వల్లాల సుభాష్, కూషణ రాజన్న, ముంజం శ్రీనివాస్, గోగర్ల రాములు, కల్లూరి శ్రీనివాస్, అంబాల ఓదెలు, రాగులయ్య, కలికోట రమణయ్య, బింగీ రమేష్, సి. వెంకటేశ్, షబ్బీర్, నగరం గణపతి, రాజేష్ యాదవ్, నానాజీ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793