ఖమ్మంలో మైనర్ బాలికపై దారుణ ఘటనను ఖండించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, జూన్ 10: ఖమ్మం నగరంలో ఓ మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒక వ్యక్తి అసభ్య ప్రవర్తనకు పాల్పడి, అనంతరం బాలికను భవనం పై నుంచి తోసివేసినట్లు ఆరోపణలు రావడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బాధితురాలిపై జరిగిన ఈ అమానవీయ చర్యను మంత్రి తీవ్రంగా ఖండించారు. మైనర్ బాలికల భద్రత విషయంలో ఎలాంటి రాజీకి తావు లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు.
ఈ కేసులో నిందితుడిపై POCSO చట్టం కింద కేసు నమోదు చేయడం సముచిత చర్య అని మంత్రి అభిప్రాయపడ్డారు. దోషికి చట్టం ప్రకారం అత్యంత కఠిన శిక్ష పడేలా వేగవంతమైన, నిష్పక్షపాత విచారణ నిర్వహించి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
బాధితురాలికి తక్షణ వైద్య సహాయం, అవసరమైన మానసిక మద్దతు అందించడంతో పాటు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మహిళలు, బాలికల భద్రత కోసం అమలులో ఉన్న చట్టాలను మరింత కఠినంగా అమలు చేయడంతో పాటు, సమాజంలో అవగాహన పెంపొందించడం కూడా అత్యంత అవసరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Post a Comment