అనిశా వలలో సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్.. కరీంనగర్‌లో ఏసీబీ అరెస్ట్
అనిశా వలలో సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ కరీంనగర్‌లో ఏసీబీ అరెస్ట్
కరీంనగర్, జూన్ 10: కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న దనుక రాధిక (44)ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు.
ఏసీబీ ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, కాంట్రాక్టర్ల బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేస్తానని చెప్పి తన అధికారిక హోదాను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బిల్లుల ఆమోదానికి సంబంధించి బినామీ బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమంగా కమిషన్లు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
అంతేకాకుండా, ఈ అక్రమ లావాదేవీల నిర్వహణ కోసం కొందరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఏసీబీ విచారణలో తేలినట్లు తెలుస్తోంది. అందిన ఫిర్యాదులు, సేకరించిన ఆధారాల ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు రాధికను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
ఈ వ్యవహారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, బినామీ ఖాతాల వినియోగం, ఇతర అధికారుల ప్రమేయం వంటి అంశాలపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
అవినీతి ఆరోపణలపై ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ నిఘా మరింత కట్టుదిట్టం చేస్తున్న నేపథ్యంలో ఈ అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

Post a Comment