సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. దర్శక శిఖరం భారతీరాజా కన్నుమూత
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. దర్శక శిఖరం భారతీరాజా కన్నుమూత
చెన్నై, జూన్ 10: దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒక యుగానికి తెరపడింది. తమిళ సినీ రంగంలో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గ్రామీణ జీవనశైలిని, పల్లె సంస్కృతిని వెండితెరపై సహజత్వంతో ఆవిష్కరించిన దర్శకుడిగా భారతీరాజా ప్రత్యేక గుర్తింపు పొందారు. సినిమా అంటే స్టూడియోలకు మాత్రమే పరిమితం కాదని, పల్లెల్లోనూ అద్భుత కథలు దాగి ఉన్నాయని నిరూపించిన దర్శకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచారు.
1977లో కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘16 వయదినిలే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన భారతీరాజా తొలి చిత్రంతోనే సంచలనం సృష్టించారు. ఈ చిత్రం తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రీమేక్ అయి ఘన విజయం సాధించింది. అనంతరం ‘కిళకే పోగుమ్ రైల్’, ‘సిగప్పు రోజాక్కల్’, ‘అలైగళ్ ఓయివతిల్లై’, ‘ముదల్ మరియాదై’ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించారు.
తమిళ సినీ రంగం ఆయనకు గౌరవ సూచకంగా ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శక శిఖరం) అనే బిరుదును ప్రదానం చేసింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు దర్శకుడిగా కొనసాగిన ఆయన 40కి పైగా చిత్రాలను తెరకెక్కించి తమిళ సినిమాకు కొత్త దిశను చూపించారు.
ఇటీవలి కాలంలో నటుడిగానూ భారతీరాజా ప్రేక్షకులను అలరించారు. ‘ఆయుధ ఎళుత్తు’, ‘పాండియనాడు’, ‘ఈశ్వరన్’, ‘తిరుచిత్రంబలం’, ‘మహారాజా’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఆయన నటించిన ‘పులవర్’ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇదే ఆయన చివరి చిత్రం కానుంది.
గత ఏడాది తన కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా ఆకస్మిక మరణం భారతీరాజాను తీవ్రంగా కలచివేసింది. పుత్రశోకంతో పాటు వృద్ధాప్య సమస్యలు ఆయన ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీశాయి. కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
భారతీరాజా మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్నారు.
పల్లె కథలకు జీవం పోసిన దర్శక శిఖరం భారతీరాజా మరణంతో భారతీయ సినిమా ఒక గొప్ప సృజనాత్మక శక్తిని కోల్పోయింది.

Post a Comment