ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఐదుగురికి జైలు శిక్ష, జరిమానా
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఐదుగురికి జైలు శిక్ష, జరిమానా
హైదరాబాద్, జూన్ 6: మహిళల భద్రత విషయంలో రాజీ పడబోమని హైదరాబాద్ షీ టీమ్స్ మరోసారి స్పష్టం చేసింది. చార్మినార్ పరిసర ప్రాంతంలో మహిళలను వేధించిన ఐదుగురు ఈవ్‌టీజర్లపై పోలీసులు వేగంగా చర్యలు తీసుకుని, న్యాయస్థానం ద్వారా జైలు శిక్ష విధింపజేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, చార్మినార్ ప్రాంతంలో మహిళలను అనుచితంగా తాకడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధింపులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను షీ టీమ్స్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేసి వెంటనే కోర్టులో హాజరుపరిచారు.
విచారణ అనంతరం నాంపల్లి కోర్టు ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. కోర్టు ప్రతి నిందితుడికి మూడు రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ షీ టీమ్స్ అధికారులు మాట్లాడుతూ, మహిళలపై వేధింపులు, స్టాకింగ్, ఈవ్‌టీజింగ్, సైబర్ హరాస్మెంట్ వంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. మహిళలు, యువతులు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ప్రజల సహకారంతో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్న అధికారులు, అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలని, అలాగే షీ టీమ్స్ వాట్సాప్ హెల్ప్‌లైన్ 9490616555కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
మహిళల భద్రత కోసం రాష్ట్ర పోలీసు శాఖ చేపడుతున్న చర్యల్లో భాగంగా షీ టీమ్స్ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, వేధింపులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Post a Comment