గోదావరిఖనిలో కర్బలా త్యాగగాథపై అవగాహన సమావేశం
గోదావరిఖనిలో కర్బలా త్యాగగాథపై అవగాహన సమావేశం
“అంతిమ విజేత అల్-హుసైన్” – ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ
గోదావరిఖని, జూన్ 25: గోదావరిఖనిలోని 8 ఇంక్లైన్ కాలనీ జమాత్-ఎ-ఇస్లామీ హింద్ (JIH) లైబ్రరీలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో జమాత్-ఎ-ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షుడు, హెచ్‌ఎంఎస్ జాతీయ కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ పాల్గొని కర్బలా చరిత్ర, అల్-హుసైన్ త్యాగం మరియు దాని సందేశంపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్బలా సంఘటన కేవలం ఒక యుద్ధం కాదని, అన్యాయం, నిరంకుశత్వం, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సత్యం, న్యాయం, ఆత్మగౌరవం కోసం సాగిన మహోన్నత పోరాటమని పేర్కొన్నారు. ప్రవక్త మహమ్మద్ మనవడు అల్-హుసైన్ తన ప్రాణాలను అర్పించినా ధర్మాన్ని వదలలేదని, అందుకే ఆయన చరిత్రలో శాశ్వత విజేతగా నిలిచారని అన్నారు.
ప్రవక్త మహమ్మద్ తన మనవళ్లు అల్-హసన్, అల్-హుసైన్‌లను ఎంతో ప్రేమించేవారని, వారిని “నా రెండు సుగంధ పుష్పాలు”గా అభివర్ణించారని గుర్తుచేశారు. అలాగే వీరిద్దరూ స్వర్గంలోని యువకులకు నాయకులని ప్రవక్త ప్రకటించిన విషయాన్ని వివరించారు.
ముఆవియా మరణానంతరం యజీద్ పాలనలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులను వివరిస్తూ, అల్-హుసైన్ అన్యాయ పాలనకు తలొగ్గకుండా సత్యం కోసం నిలబడ్డారని చెప్పారు. కూఫా ప్రజల ఆహ్వానం మేరకు ఇరాక్‌కు బయలుదేరిన హుసైన్, చివరికి కర్బలాలో కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి శత్రు సైన్యాల ముట్టడిని ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
ఆషూరా రోజున నీటి సరఫరా నిలిపివేసి, ఆకలి దప్పులతో బాధపడుతున్నప్పటికీ హుసైన్ అనుచరులు వెనక్కి తగ్గలేదని, చివరి వరకు ధైర్యంగా పోరాడి అమరులయ్యారని వివరించారు. బాహ్యంగా అది ఓటమిలా కనిపించినా, ఆధ్యాత్మికంగా మరియు నైతికంగా అది మానవ చరిత్రలో గొప్ప విజయమని ఆయన అన్నారు.
“దుర్మార్గులు శరీరాన్ని చంపగలరు గానీ, ధర్మం కోసం నిలిచే ఆత్మను, సత్య సందేశాన్ని ఎప్పటికీ అంతం చేయలేరు” అనే సందేశాన్ని కర్బలా ప్రపంచానికి అందించిందని ఇస్మాయిల్ నిజామీ పేర్కొన్నారు.
సయ్యద్ జావిద్ అక్మల్ హుస్సేనీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అబ్దుల్ రజాక్, ఫయాజుద్దీన్, జుబేర్, మక్సూద్ అహ్మద్ ఖాన్, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో కర్బలా త్యాగగాథ నుండి స్ఫూర్తి పొంది సమాజంలో న్యాయం, ధర్మం, మానవ విలువల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Post a Comment