-->

ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. దోపిడీ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి

ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. దోపిడీ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి

ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. దోపిడీ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి

హైదరాబాద్: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంటి దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరులో నివాసం ఉంటున్న రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ ఇంట్లో జరిగిన భారీ దోపిడీ వెనుక నేపాలీ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాలు కేసును మరింత సంచలనంగా మార్చాయి. ప్రొఫెసర్ ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన మమత, రాజేశ్‌లు కేవలం 13 రోజుల వ్యవధిలోనే ఇంటి పరిస్థితులు, కుటుంబ సభ్యుల అలవాట్లు, ఆస్తి వివరాలను పూర్తిగా తెలుసుకుని దోపిడీకి పక్కా ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు.

గత నెల 12వ తేదీన ప్రణాళిక ప్రకారం నిందితులు ప్రొఫెసర్ మురళీధర్ మోహన్‌కు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం ఆయన భార్య విజయలక్ష్మిని బెదిరించి ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను దోచుకుని పరారయ్యారు. ఈ ఘటన అనంతరం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల విచారణలో మమత, రాజేశ్‌లతో పాటు సబీనా, చాంగ్, సామ్రాట్, బిశ్వాల్, కమల్, శంకర్ తదితరులు ఈ దోపిడీకి కుట్ర పన్నినట్లు తేలింది. కేసు నమోదైన కొద్ది రోజులకే సునిత, బిశ్వాల్, కమల్ బహదూర్, శంకర్‌లను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా పరారీలో ఉన్న మరో నలుగురు కీలక నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

యజమానుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న నిందితులు

ఈ కేసుపై మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి వివరాలు వెల్లడించారు. ప్రొఫెసర్ కుటుంబం విదేశాల్లో ఉన్న తమ పిల్లల సిఫారసుతో నేపాల్‌కు చెందిన మీనా, సబీనాలను పనిమనుషులుగా నియమించుకున్నట్లు తెలిపారు. సబీనా తన భర్తగా రాజేశ్‌ను పరిచయం చేయగా, నిందితులు కుటుంబ సభ్యుల నమ్మకాన్ని పూర్తిగా సంపాదించుకున్నారని చెప్పారు.

“మేము మిమ్మల్ని తల్లిదండ్రుల్లా భావిస్తున్నాం” అంటూ తరచూ ప్రొఫెసర్ దంపతులకు చెప్పేవారని, అదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీకి పాల్పడ్డారని సీపీ పేర్కొన్నారు.

బర్త్‌డే పేరుతో దోపిడీ ప్లాన్

గత నెల 11వ తేదీన మీనా పుట్టినరోజు వేడుకల పేరుతో నిందితులు దోపిడీకి ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఏడుగురు కలిసి ఇంట్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. ఘటన అనంతరం నిందితులు వివిధ రాష్ట్రాలకు పారిపోయి, చివరకు నేపాల్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులు వారి కదలికలను గుర్తించి పట్టుకున్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో నిందితుల ఫొటోలు ప్రదర్శిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. దీంతో నిందితులు తప్పించుకునే అవకాశం లేకుండా చేసి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

“మమ్మల్ని చంపొద్దు” అంటూ వేడుకున్న బాధితురాలు

దోపిడీ సమయంలో విజయలక్ష్మి నిందితులను ఉద్దేశించి, “మిమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నాం.. మమ్మల్ని చంపొద్దు” అంటూ వేడుకున్నట్లు సీపీ సుమతి వెల్లడించారు. అయితే నిందితులు కనికరం చూపకుండా దోపిడీ చేసి పరారయ్యారని తెలిపారు.

మీనాపై ఇప్పటికే కేసు

దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. ప్రధాన నిందితురాలు మీనాపై 2023లోనే మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత నేర చరిత్రను దాచిపెట్టి ఆమె పనిమనిషిగా చేరినట్లు తేలింది.

సురక్ష యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచన

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గృహ సహాయకులు, పనివాళ్ల వివరాలను తప్పనిసరిగా పోలీసులకు అందించాలని సీపీ సుమతి ప్రజలకు సూచించారు. ఇప్పటివరకు 39,640 మందికి పైగా సురక్ష యాప్‌లో నమోదు చేసుకున్నారని, ప్రజలు కూడా తమ వద్ద పనిచేసే వ్యక్తుల వివరాలను ధృవీకరించుకోవాలని కోరారు.

ప్రస్తుతం కేసుకు సంబంధించిన దోపిడీ సొత్తు స్వాధీనం, ముఠా కార్యకలాపాలు, ఇతర రాష్ట్రాల్లో వారి నేర చరిత్రపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793