-->

జూలై 16 నుంచి గోల్కొండ బోనాలు.. పోస్టర్ విడుదల చేసిన మంత్రి కొండా సురేఖ

జూలై 16 నుంచి గోల్కొండ బోనాలు.. పోస్టర్ విడుదల చేసిన మంత్రి కొండా సురేఖ
 జూలై 16 నుంచి గోల్కొండ బోనాలు.. పోస్టర్ విడుదల చేసిన మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, జూలై 11: తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే ఆషాడ బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబికా అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశంలో పాల్గొన్న మంత్రి, ఈ సందర్భంగా ఆషాడ బోనాల జాతర పోస్టర్, బ్రోచర్‌ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ప్రతి ఏడాది నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాలు నగర గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. బోనాలు, ముస్లిం పండుగల సమయంలో హిందూ, ముస్లిం సమాజాలు పరస్పర సహకారంతో వ్యవహరించడం దేశానికి లౌకిక స్ఫూర్తిని చాటే గొప్ప సందేశమని పేర్కొన్నారు.

జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే గోల్కొండ బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. లంగర్ హౌస్ కూడలి నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి బోనం సమర్పణ, తొట్టెల ఊరేగింపు, మెట్ల పూజకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.

ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, క్యూ లైన్లు, బారికేడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలను సమగ్రంగా అందుబాటులో ఉంచాలని మంత్రి స్పష్టం చేశారు. దేవాలయ ప్రాంగణంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మొబైల్ టాయిలెట్లు, తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

భక్తుల భద్రత కోసం ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, శివసత్తుల భద్రతపై అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించి భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793