-->

యువత మత్తుకు బానిసలు కావద్దు: ఏసీపీ మడత రమేష్ హెచ్చరిక

 

యువత మత్తుకు బానిసలు కావద్దు: ఏసీపీ మడత రమేష్ హెచ్చరిక

యువత మత్తుకు బానిసలు కావద్దు: ఏసీపీ మడత రమేష్ హెచ్చరిక

పెద్దపల్లి, జూలై 29: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం ఏసీపీ మడత రమేష్ పిలుపునిచ్చారు. మంథని పోలీస్ స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన మత్తు పదార్థాల నివారణ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

ఏసీపీ వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి మంథనిలోని తమ్మచెరువు కట్టపై ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు వారిని తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి కొన్ని టాబ్లెట్లు, సిరంజీలు స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో గంజాయి సేవించే అలవాటు ఉన్న వీరికి ఇటీవల గంజాయి అందుబాటులో లేకపోవడంతో మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసిన కొన్ని టాబ్లెట్లను నీటిలో కలిపి ఇంజక్షన్ ద్వారా మత్తు కోసం వినియోగిస్తున్నట్లు వెల్లడించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు.

అక్రమంగా మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఏసీపీ, మత్తు పదార్థాలకు బానిసలైన యువత తల్లిదండ్రులకు కూడా డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.

అలాగే మెడికల్ షాప్ యజమానులు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మైనర్లు లేదా అనుమానాస్పద వ్యక్తులకు టాబ్లెట్లు విక్రయించవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో మంథని సీఐ బుద్దే స్వామి, ఎస్సై సందీప్ కుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793