-->

నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి

ఆదిలాబాద్‌లో నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి


 ఆదిలాబాద్‌లో నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి

ఆదిలాబాద్ జిల్లాలో నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. తలమడుగు మండలం రూయ్యడి గ్రామానికి చెందిన ఆత్రం గంగామణి అనే చిన్నారిని గ్రామానికి చెందిన ఓ మహిళ తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకెళ్లి, గుర్తు తెలియని వ్యక్తులకు అప్పగించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, రూయ్యడి గ్రామానికి చెందిన నైతం నాగుబాయి సోమవారం మధ్యాహ్నం చిన్నారి ఆత్రం గంగామణిని తల్లిదండ్రులకు తెలియకుండా ఆదిలాబాద్ పట్టణానికి తీసుకెళ్లింది. అనంతరం బస్టాండ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులకు చిన్నారిని అప్పగించినట్లు ప్రాథమిక సమాచారం లభించింది.

చిన్నారి కనిపించకపోవడంతో ఆమె తల్లి ఆత్రం కప్లిబాయి తలమడుగు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే రూరల్ సీఐ రహీం పాషా, తలమడుగు ఎస్‌ఐ డి. రాధిక, రూరల్ ఎస్‌ఐ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా ఆదిలాబాద్, తాంసి బస్టాండ్ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, నిందితురాలు చిన్నారితో కలిసి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డైనట్లు పోలీసులు వెల్లడించారు. ఆ ఆధారాలపై పోలీసులు గాలింపును మరింత ముమ్మరం చేశారు.

నాలుగేళ్ల వయస్సు గల ఆత్రం గంగామణికి కోలాం భాషతో పాటు కొద్దిగా తెలుగు మాట్లాడటం వచ్చని పోలీసులు తెలిపారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.

చిన్నారి ఎక్కడైనా కనిపించినా లేదా ఆమెకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు, డయల్ 100కు లేదా సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి ప్రజలను కోరారు. చిన్నారిని త్వరితగతిన గుర్తించి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793