హాస్టళ్లు, పీజీల్లో మహిళల భద్రతకు 'ప్రాజెక్ట్ సేఫ్ స్టే'.. నమోదు తప్పనిసరి
హాస్టళ్లు, పీజీల్లో మహిళల భద్రతకు 'ప్రాజెక్ట్ సేఫ్ స్టే'.. నమోదు తప్పనిసరి
హైదరాబాద్, జూలై 17: ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వచ్చే మహిళలు, విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ హైదరాబాద్ సిటీ పోలీసులు **'ప్రాజెక్ట్ సేఫ్ స్టే'**ను ప్రారంభించారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC), యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా తొలి దశలో 'సురక్ష నివాస్ 1.0' మార్గదర్శకాల బ్రోచర్‌ను బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సంయుక్తంగా ఆవిష్కరించారు.
అనంతరం నగరంలోని హాస్టళ్లు, పీజీల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మహిళల భద్రత, భద్రతా ప్రమాణాల అమలుపై కీలక సూచనలు చేశారు.
హాస్టళ్లు, పీజీల నమోదు ఇక తప్పనిసరి
ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ నగర పరిధిలోని ప్రతి మహిళా హాస్టల్, పీజీ నిర్వాహకులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. కొత్తగా అమల్లోకి తెచ్చిన రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం నిర్దేశిత ఫామ్-ఏను పూర్తి చేసి స్థానిక పోలీసులకు సమర్పించాలని సూచించారు.
సర్వేలో వెలుగుచూసిన భద్రతా లోపాలు
నగరంలోని 447 మహిళా హాస్టళ్లలో 10 ప్రత్యేక బృందాలతో నిర్వహించిన సర్వేలో పలు లోపాలు బయటపడ్డాయని సీపీ తెలిపారు.
97.5 శాతం హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.
43 శాతం హాస్టళ్లకు మాత్రమే సరైన కాంపౌండ్ వాల్ ఉంది.
కేవలం 38.9 శాతం హాస్టళ్లలో మాత్రమే అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ లోపాలను సరిదిద్దడానికే కొత్త విధానాన్ని తీసుకొచ్చామని, ఇది యాజమాన్యాలను ఇబ్బంది పెట్టడం కోసం కాదని, మహిళల భద్రతను బలోపేతం చేయడానికేనని ఆయన స్పష్టం చేశారు. త్వరలో హాస్టళ్లలో మహిళల భద్రత కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
ట్రేడ్ లైసెన్స్, FSSAI తప్పనిసరి
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున భవనాలను హాస్టళ్లుగా నిర్వహించడం వ్యాపార కార్యకలాపాల పరిధిలోకి వస్తుందని, అందువల్ల ప్రతి నిర్వాహకుడు తప్పనిసరిగా మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ పొందాలని సూచించారు. భోజన సదుపాయం కల్పించే హాస్టళ్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్ కలిగి ఉండాలని, లేనిపక్షంలో వాటిని అనధికారిక వసతి గృహాలుగా పరిగణిస్తామని హెచ్చరించారు.
హాస్టల్‌కు వచ్చే, వెళ్లే వారి పూర్తి వివరాలతో రిజిస్టర్ నిర్వహించడం, సిబ్బందికి పోలీస్ వెరిఫికేషన్ చేయించడం తప్పనిసరి అని తెలిపారు. కామన్ ఏరియాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని సూచించారు.
అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక సూచనలు
హైదరాబాద్ జిల్లా ఫైర్ ఆఫీసర్ టి. వెంకన్న మాట్లాడుతూ ప్రతి హాస్టల్‌లో అత్యవసర పరిస్థితుల్లో బయటపడేందుకు రెండో మెట్ల మార్గం ఉండాలని తెలిపారు. ప్రతి అంతస్తు, ప్రతి గదిలో కనీసం రెండు కిలోల సామర్థ్యం గల ఫైర్ ఎక్స్‌టింగిషర్లు ఏర్పాటు చేయాలని, హోస్ రీల్ సిస్టమ్ అందుబాటులో ఉంచితే ప్రారంభ దశలోనే మంటలను అదుపు చేయవచ్చని సూచించారు.
ఆహార నాణ్యతపై హెచ్చరిక
అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పి. మూర్తి మాట్లాడుతూ హాస్టళ్లలో పరిశుభ్రమైన వంటగదులు నిర్వహించాలని, క్రమం తప్పకుండా పెస్ట్ కంట్రోల్ చేయించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి నాణ్యతలేని ఆహారం అందిస్తే ఆహార నమూనాలు సేకరించి క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
భద్రతతో పాటు విశ్వసనీయత పెరుగుతుంది
హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC) సెక్రటరీ జనరల్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ హాస్టళ్ల నిర్వహణ వ్యాపారం మాత్రమే కాదని, బాధ్యతాయుతమైన సేవ అని పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించడం ద్వారా ఆన్‌లైన్ సేఫ్టీ రేటింగ్ మెరుగై, నిర్వాహకుల విశ్వసనీయత, బ్రాండ్ విలువ కూడా పెరుగుతుందని తెలిపారు.


Post a Comment