-->

అందెశ్రీ నా ఆత్మబంధువు.. ఆయన స్ఫూర్తే ప్రజా ప్రభుత్వానికి శ్రీరామరక్ష: సీఎం రేవంత్ రెడ్డి

 

అందెశ్రీ నా ఆత్మబంధువు.. ఆయన స్ఫూర్తే ప్రజా ప్రభుత్వానికి శ్రీరామరక్ష: సీఎం రేవంత్ రెడ్డి

అందెశ్రీ నా ఆత్మబంధువు.. ఆయన స్ఫూర్తే ప్రజా ప్రభుత్వానికి శ్రీరామరక్ష: సీఎం రేవంత్ రెడ్డి

ఘట్‌కేసర్, జూలై 18: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో ఏర్పాటు చేయనున్న అందెశ్రీ స్మృతి వనం నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన సీఎం అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

"నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అందెశ్రీ కవిగా, గాయకుడిగా, ఉద్యమకారుడిగా తెలిసి ఉండొచ్చు. కానీ నాకు మాత్రం ఆయన ఆత్మబంధువు. నేను ముఖ్యమంత్రిగా ఈ స్థాయికి రావడంలో ఆయన గళం, ఆయన పాటలు, ఆయన స్ఫూర్తి కీలక పాత్ర పోషించాయి" అని పేర్కొన్నారు.

తమ కుటుంబంలో పెద్దన్నను కోల్పోయిన తర్వాత తనకు పెద్దన్నలా అండగా నిలిచింది అందెశ్రీనే అని సీఎం తెలిపారు. "కవి, గాయకుడు, ఉద్యమకారుడే కాదు.. మా కుటుంబ సభ్యుడయ్యారు. నాకు కనిపించిన పెద్దన్న అందెశ్రీ" అని అన్నారు.

తెలంగాణపై ఆధిపత్యం చెలాయించాలని, ఈ నేలను దోచుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రతి తరంలోనూ మరో అందెశ్రీ పుడతాడని సీఎం హెచ్చరించారు. అందెశ్రీ స్ఫూర్తి ప్రతి తెలంగాణవాసి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ప్రజా ప్రభుత్వానికి అదే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. గద్దర్, అందెశ్రీల ఆశయాలతోనే తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు, జీవితాలు అర్పించిన తొమ్మిది మంది ఉద్యమకారుల కుటుంబాలకు పార్టీలు చూడకుండా ఒక్కో కుటుంబానికి రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం అందించామని, అది ప్రజల సొమ్ముతో చేసిన గౌరవమని సీఎం వెల్లడించారు.

అందెశ్రీ రచించిన "జయ జయహే తెలంగాణ", "మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు" వంటి పాటలు కేవలం గీతాలు కాదని, ప్రజా వ్యతిరేక పాలకులను కదిలించిన ఉద్యమ ఫిరంగులని కొనియాడారు. ఆయన పదాలు తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ప్రతి బిడ్డను ఉద్యమ మార్గంలో నడిపించాయని అన్నారు.

2024 జూన్ 2న "జయ జయహే తెలంగాణ" గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన సందర్భంగా అందెశ్రీ భావోద్వేగానికి లోనైన సంఘటనను కూడా సీఎం గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే అందెశ్రీ కుటుంబ సభ్యులు మల్లుబాయి, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తుల సమక్షంలో సీఎం భూమిపూజ నిర్వహించి పుష్పాంజలి ఘటించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793