నకిలీ ఎరువుల తయారీ కేంద్రం బట్టబయలు
హైదరాబాద్ శివారులో నకిలీ ఎరువుల తయారీ కేంద్రం బట్టబయలు
10 వేల నకిలీ ఎరువుల బస్తాలు సీజ్.. రైతు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం
అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 19: హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్‌పేటలో నకిలీ ఎరువులు తయారు చేస్తున్న కేంద్రాన్ని పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా గుర్తించి భారీగా నకిలీ ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 10 వేల నకిలీ ఎరువుల బస్తాలను సీజ్ చేసిన అధికారులు, వాటి నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.
ఈ వ్యవహారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘనాథపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు అప్రమత్తతతో వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎరువుల దుకాణంలో కొనుగోలు చేసిన డీఏపీ ఎరువుపై అనుమానం రావడంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు సంబంధిత ఎరువుల దుకాణంపై దాడి చేసి నిర్వాహకుడిని విచారించారు. విచారణలో తాను నకిలీ ఎరువులను విక్రయించినట్లు, అవి హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేటలో ఉన్న కేంద్రం నుంచి సరఫరా అవుతున్నట్లు వెల్లడించాడు.
ఈ సమాచారం ఆధారంగా మఠంపల్లి ఎస్‌ఐ తన సిబ్బంది, అబ్దుల్లాపూర్‌మెట్ మండల వ్యవసాయ శాఖ అధికారులు, హయత్‌నగర్ పోలీసులతో కలిసి పెద్ద అంబర్‌పేట హరితహారం కాలనీలో 'త్రిమూర్తి ఎంటర్‌ప్రైజెస్' పేరుతో నిర్వహిస్తున్న కేంద్రంపై గురువారం రాత్రి దాడులు నిర్వహించారు.
దాడుల్లో ఎంఓపీ (మ్యూరియేట్ ఆఫ్ పొటాష్), 17-17-17 పేర్లతో తయారు చేస్తున్న నకిలీ ఎరువుల బస్తాలు భారీ సంఖ్యలో గుర్తించారు. కేంద్రంలో సుమారు 10 వేల నకిలీ ఎరువుల బస్తాలు నిల్వ ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఎరువుల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో నాణ్యతను నిర్ధారించుకుని, అనుమానం ఉంటే వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

Post a Comment