-->

ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు.. గర్భిణి ప్రాణం బలి.. తండ్రి కళ్లముందే విషాదం

 

ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు.. గర్భిణి ప్రాణం బలి.. తండ్రి కళ్లముందే విషాదం

ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు.. గర్భిణి ప్రాణం బలి.. తండ్రి కళ్లముందే విషాదం

జోగులాంబ గద్వాల జిల్లా: ఓ కుటుంబంలో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత నెలకొన్న ఆనందం క్షణాల్లో విషాదంగా మారింది. ఐదేళ్ల తర్వాత గర్భం దాల్చిన ఓ గర్భిణి ప్రసవం కోసం పుట్టింటికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పుల్లూరు స్టేజీ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

మానవపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన చాకలి ప్రియాంకకు 2021లో నంద్యాల జిల్లా మిడివేముల గ్రామానికి చెందిన చాకలి చిన్నబజారుతో వివాహమైంది. పెళ్లైన ఐదేళ్ల వరకు సంతానం కలగకపోవడంతో దంపతులు ఎన్నో పూజలు, వ్రతాలు చేశారు. చివరకు ప్రియాంక గర్భం దాల్చడంతో రెండు కుటుంబాల్లోనూ ఆనంద వాతావరణం నెలకొంది.

గర్భం ఐదు నెలలు పూర్తవడంతో సంప్రదాయం ప్రకారం భర్త ఇంట్లో నిర్వహించే కార్యక్రమం అనంతరం ప్రసవం కోసం పుట్టింటికి బయలుదేరింది. తండ్రి చాకలి రాముడు తన కుమార్తెను ద్విచక్ర వాహనంపై జాగ్రత్తగా తీసుకొస్తుండగా పుల్లూరు స్టేజీ సమీపంలో ఏపీ రాష్ట్రానికి చెందిన అనంతపురం డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ప్రియాంక అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె తండ్రి రాముడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు టైరు ప్రియాంక తలపై నుంచి వెళ్లడంతో అక్కడి దృశ్యాన్ని చూసిన వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

పెళ్లైన ఐదేళ్ల తర్వాత గర్భం దాల్చిన ప్రియాంక కడుపులోని శిశువుతో పాటు ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను, గ్రామస్తులను శోకసంద్రంలో ముంచెత్తింది. భర్తకు జీవితాంతం గుర్తుండిపోయే ఆనందాన్ని, తండ్రికి మనవడిని లేదా మనవరాలిని చూపించాల్సిన ఆమె ఇలా అకాల మరణం చెందడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

ఈ ఘటన వెనుక మరింత విషాదకరమైన కుటుంబ కథ ఉంది. చాకలి రాముడికి ముగ్గురు కుమార్తెలు ఉండగా, పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె ఇద్దరూ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వారిని చూసుకుంటూ జీవితాంతం బాధను మోస్తున్న రాముడికి రెండో కుమార్తె ప్రియాంకే పెద్ద ఆధారం. చిన్నప్పటి నుంచే చురుకుగా, బాధ్యతగా ఉండే ప్రియాంకను మంచి కుటుంబంలో పెళ్లి చేసి సంతోషంగా చూడాలనే ఆశతో 2021లో వివాహం జరిపించాడు.

ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ఆమె గర్భం దాల్చడంతో తన కుటుంబంలో మళ్లీ సంతోషం నిండుతుందని ఆశించిన రాముడికి, అదే కుమార్తె తన కళ్ల ముందే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదంగా మిగిలింది. ఒకవైపు గర్భిణి, మరోవైపు పుట్టబోయే శిశువు మృతితో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793