ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ ను ఢీ కొట్టిన బస్సు ఐదుగురు మృతి 20 మందికి తీవ్ర గాయాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ ను ఢీ కొట్టిన బస్సు ఐదుగురు మృతి 20 మందికి తీవ్ర గాయాలు
సూర్యాపేట: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్–విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ఎలక్ట్రిక్ ట్రావెల్స్‌కు చెందిన ‘ఫ్రెష్ బస్’ అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటైనర్ డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ప్రమాద సమయంలో బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తోంది. అత్యంత వేగంతో దూసుకొచ్చిన బస్సు కంటైనర్ డీసీఎంను ఢీకొనడంతో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. క్యాబిన్‌లో ఉన్న వారు తీవ్రంగా ఇరుక్కుపోవడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో డ్రైవర్, క్లీనర్‌తో కలిపి బస్సులో మొత్తం 42 మంది ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను బయటకు తీసి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించారు.
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

Post a Comment