ఎల్బీనగర్ పీఎస్‌లో కానిస్టేబుల్ బలవన్మరణం.. కారణాలపై పోలీసుల దర్యాప్తు
ఎల్బీనగర్ పీఎస్‌లో కానిస్టేబుల్ బలవన్మరణం.. కారణాలపై పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయి కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్‌లోని రెస్ట్ రూమ్‌లో గత రాత్రి అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
విషయం గుర్తించిన సహచర పోలీసులు వెంటనే సాయి కుమార్‌ను సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మంగళవారం కూడా సాయి కుమార్ విధులు నిర్వహించినట్లు తోటి సిబ్బంది వెల్లడించారు. కర్మన్‌ఘాట్‌లో స్నేహితులతో కలిసి ఓ గదిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు.
సాయి కుమార్ మృతిపై పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
కాగా, 2024 బ్యాచ్‌కు చెందిన సాయి కుమార్ (13128) కానిస్టేబుల్‌గా నియమితులయ్యాడు. ప్రస్తుతం కాప్స్ డ్యూటీ కోసం ఏసీపీ కార్యాలయానికి అటాచ్‌మెంట్‌లో ఉన్నట్లు సమాచారం. అతడి బలవన్మరణానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయి కుమార్ వ్యక్తిగత, విధి సంబంధిత పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు.

Post a Comment