నర్సంపేటలో ఉద్రిక్తత.. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఎర్రబెల్లి ఆగ్రహం
నర్సంపేటలో ఉద్రిక్తత.. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఎర్రబెల్లి ఆగ్రహం
వరంగల్ జిల్లా, నర్సంపేట: దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేయడం నర్సంపేటలో ఉద్రిక్తతకు దారితీసింది. గద్దె కూల్చిన ప్రదేశాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విగ్రహ గద్దెను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన వెనుక కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉందనే అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం
ఎన్ని ఆటంకాలు, ఎన్ని కుట్రలు చేసినా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఖచ్చితంగా ఆవిష్కరించి తీరుతామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. నర్సంపేట పట్టణంలో ఇప్పటికే అనేక మంది నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశారని, వాటిలో ఎన్ని విగ్రహాలు అధికారిక అనుమతులతో ఏర్పాటు చేశారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మరణానికి ముందు ఆయన ఎదుర్కొన్న పరిస్థితులపై కూడా ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఎర్రబెల్లి పేర్కొన్నారు. విగ్రహ గద్దె కూల్చివేత ఘటనతో పాటు ఆ అంశాలపైనా సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని అన్నారు.
రెండు రోజుల గడువు.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు హెచ్చరిక
ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కార్యక్రమాలు కొనసాగుతున్నందున తాత్కాలికంగా ధర్నాను విరమించుకుంటున్నట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రోజుల సమయం ఇస్తున్నామని చెప్పారు.
ఈ రెండు రోజుల్లోగా విగ్రహ గద్దెను కూల్చిన బాధ్యులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గౌరవం, న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.

Post a Comment