-->

బాల్య వివాహాలు, మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

 

బాల్య వివాహాలు, మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

బాల్య వివాహాలు, మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

కొత్తగూడెం లీగల్: బాల్య వివాహాల నిర్మూలనతో పాటు మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు కొత్తగూడెం పట్టణంలోని కూలీలైన్ జెడ్పీ హైస్కూల్‌లో శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై న్యాయవాదులు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చెందిన నల్సా ఆశ న్యాయ సహాయ యూనిట్ ప్యానల్ అడ్వకేట్లు గాజుల రామమూర్తి, షాజహాన్ పర్వీన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

గాజుల రామమూర్తి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు బాలల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. బాల్య వివాహాల కారణంగా పిల్లలు విద్యకు దూరమవడంతో పాటు శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వివరించారు. బాల్య వివాహాల నిరోధక చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ.. బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

షాజహాన్ పర్వీన్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. మాదకద్రవ్యాల ప్రభావం ఆరోగ్యం, చదువు, కుటుంబ జీవితం, భవిష్యత్తుపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, చెడు స్నేహాలకు లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటించాలని సూచించారు.

విద్యార్థులు తమ హక్కులు, చట్టపరమైన రక్షణలు, న్యాయ సహాయ సేవల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరమని న్యాయవాదులు పేర్కొన్నారు. అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మెండు రాజమల్లు, పెసరమిల్లి నాగేశ్వరరావు, పారా లీగల్ వాలంటీర్ షానాజ్ బేగం, పాఠశాల హెడ్‌మాస్టర్ లాలు, ఉపాధ్యాయుడు దేవీలాల్, విద్యార్థినులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.