-->

న్యూడ్‌ వీడియోలతో యువతికి వేధింపులు.. ఆత్మహత్యకు సిద్ధమైన కుటుంబం

 

న్యూడ్‌ వీడియోలతో యువతికి వేధింపులు.. ఆత్మహత్యకు సిద్ధమైన కుటుంబం

న్యూడ్‌ వీడియోలతో యువతికి వేధింపులు.. ఆత్మహత్యకు సిద్ధమైన కుటుంబం

24 గంటల్లోనే నిందితుడి అరెస్ట్‌.. కుటుంబాన్ని కాపాడిన నూజివీడు పోలీసులు

ఏలూరు జిల్లా, నూజివీడు: రాజమండ్రిలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన ఘటనను తలపించేలా ఏలూరు జిల్లా నూజివీడులో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని నమ్మించి, ఆమెతో పంచుకున్న వ్యక్తిగత న్యూడ్‌ వీడియోలను అడ్డుపెట్టుకుని డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడిన యువకుడిని నూజివీడు పోలీసులు 24 గంటలు గడవకముందే అరెస్టు చేసి ఓ కుటుంబాన్ని ఆత్మహత్య ఆలోచన నుంచి బయటపడేశారు.

నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ శనివారం కేసు వివరాలను వెల్లడించారు. నూజివీడుకు చెందిన ఓ యువతికి ఆన్‌లైన్‌ లూడో కం ఫన్‌ గేమ్‌ ద్వారా మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన రోహన్‌ వైకుంఠం వేముల పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వారి పరిచయం మరింత పెరిగింది. ఈ క్రమంలో ఇద్దరూ వ్యక్తిగత న్యూడ్‌ వీడియోలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.

అయితే ఇదే విషయాన్ని ఆసరాగా చేసుకున్న రోహన్‌.. యువతిని డబ్బుల కోసం వేధించడం ప్రారంభించాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆమెకు సంబంధించిన వీడియోలను ఇతరులకు షేర్‌ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. చివరకు ఈ నెల 26న యువతి తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఆ వీడియోలను ఆయనతో పాటు బంధుమిత్రులకు షేర్‌ చేశాడు.

దీంతో తీవ్ర అవమానానికి గురైన యువతి, ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. పరిస్థితిని తట్టుకోలేక ముగ్గురూ విషం తాగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అదే సమయంలో యువతికి ఆమె స్నేహితురాలు ఫోన్‌ చేయడంతో అసలు విషయం చెప్పి బాధపడింది. వెంటనే అప్రమత్తమైన స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించింది. నూజివీడు రూరల్‌ సీఐ నాగేంద్రకుమార్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి బాధితులను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ధైర్యం చెప్పడంతో పాటు భరోసా కల్పించారు. అనంతరం యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

నూజివీడు పట్టణ ఎస్‌ఐ లక్ష్మణ్‌బాబు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి వెంటనే మహారాష్ట్రలోని షోలాపూర్‌కు పంపించారు. పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే, ఈ నెల 27న నిందితుడు రోహన్‌ వైకుంఠం వేములను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం నిందితుడిని శనివారం నూజివీడు కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.

అప్రమత్తతతో తప్పిన పెను విషాదం:

సమయానికి యువతి స్నేహితురాలు స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఓ కుటుంబంలో పెను విషాదం తప్పింది. వ్యక్తిగత వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడేవారిపై భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో బాధితుల వివరాలను గోప్యంగా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793