అలియాస్ పేర్ల కార్మికులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యే కూనంనేని
అలియాస్ పేర్ల కార్మికులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెం: సింగరేణి సంస్థలో అలియాస్ పేర్లతో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, వారి పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని సింగరేణి గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట అలియాస్ పేర్ల బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శనివారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సందర్శించి బాధితులకు సంపూర్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో పనిచేసేందుకు గతంలో ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరక్షరాస్యులైన కార్మికులు ఉద్యోగాల్లో చేరారని గుర్తుచేశారు.
ఆ సమయంలో సరైన అవగాహన లేకపోవడంతో కొందరి పేర్లు, ఇంటిపేర్లు ఉద్యోగ రికార్డుల్లో తప్పుగా నమోదయ్యాయని తెలిపారు. ఈ విషయాన్ని సాకుగా చూపుతూ విజిలెన్స్ విభాగం కార్మికులను వేధించడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్మికుల వద్ద తండ్రుల అసలు పేర్లతో కూడిన ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాలు చూపి వారి వారసులకు ఉద్యోగాలు నిరాకరించడం అన్యాయమన్నారు.
సింగరేణి సంస్థ వ్యాప్తంగా సుమారు 420 మంది కార్మికులు ఈ సమస్య కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పేర్లను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి బాధితులను మోసం చేశారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే వైఖరిని అవలంబించకుండా బాధితుల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని కోరారు.
అలియాస్ పేర్ల సమస్య, వారసత్వ ఉద్యోగాల నిరాకరణ, విజిలెన్స్ కేసుల పేరుతో జరుగుతున్న వేధింపులపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి బాధితుల గళాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.
ఎమ్మెల్యే కూనంనేని వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్, కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, జిల్లా సమితి సభ్యులు భూక్యా శ్రీనివాస్, మునిగడప వెంకటేశ్వర్లు, గెడ్డాడు నగేష్, కె. రత్నకుమారి, యాండ్ర మహేష్, నాయకులు ఎండీ యూసుఫ్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, నేరెళ్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు మునిగడప పద్మ, బండి నర్సింహా, పి. ధనలక్ష్మి, పడాల ఆకాంక్ష, మంద నాగలక్ష్మి, పట్టణ నాయకులు కె. ధర్మరాజు, జలీల్, షహీన్, కైసర్, నాగరాజు, అస్మత్, భవాని తదితరులు పాల్గొన్నారు.

Post a Comment