-->

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు టెక్నీషియన్లు సజీవ దహనం

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు టెక్నీషియన్లు సజీవ దహనం


 కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు టెక్నీషియన్లు సజీవ దహనం

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట హవేలి శివారులోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో బుధవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్కులోని గణేషా ఎకో టెక్ పరిశ్రమలో జరిగిన ఈ ప్రమాదంలో ప్లాంట్‌లో పనిచేస్తున్న ఇద్దరు టెక్నీషియన్లు సూర్యప్రకాష్ (30), అభిలాష్ (30) సజీవ దహనమయ్యారు.

బుధవారం రాత్రి నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్లాస్టిక్ కరిగించే విభాగంలో ఒక్కసారిగా స్టీమ్ పైప్ బ్లాస్ట్ అయింది. భారీ శబ్దంతో పాటు మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో ప్లాంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.

ప్రమాద సమయంలో పై అంతస్తులోని గదిలో ఉన్న టెక్నీషియన్లు సూర్యప్రకాష్, అభిలాష్ పరిస్థితిని గమనించి మెట్ల మార్గం ద్వారా కిందకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మంటల తీవ్రత, తీవ్రమైన వేడి, దట్టమైన పొగ కారణంగా వారు లిఫ్ట్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే దురదృష్టవశాత్తు వేడి తీవ్రతకు లిఫ్ట్ మార్గంలో సాంకేతిక లోపం ఏర్పడి, లిఫ్ట్ మధ్యలోనే జామ్ అయిపోయింది. దీంతో అందులో చిక్కుకున్న ఇద్దరు టెక్నీషియన్లు బయటకు రాలేకపోయారు. మంటలు, పొగ తీవ్రత పెరగడంతో వారు ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, భద్రతా ప్రమాణాల అమలు, లిఫ్ట్‌లో సాంకేతిక లోపానికి సంబంధించిన అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

ఈ ఘటనతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793