సింగరేణి మారుపేర్ల బాధితుల నిరసన దీక్ష రెండో రోజు ఐఎన్‌టీయూసీ సంఘీభావం
సింగరేణి మారుపేర్ల బాధితుల నిరసన దీక్ష రెండో రోజు ఐఎన్‌టీయూసీ సంఘీభావం
కొత్తగూడెం, ఆగస్టు 13: సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను తక్షణమే పరిష్కరించి బాధితులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది. సింగరేణి పరిధిలోని 11 ఏరియా కోల్‌బెల్ట్ ప్రాంతాలకు చెందిన బాధితులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొని తమ ఆందోళనను కొనసాగించారు.
మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న లక్కా శ్రావణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగుతోంది. బాధితులకు ఉద్యోగాలు కల్పించే వరకు తమ పోరాటాన్ని విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘ఉద్యోగం సాధించే వరకు పోరాటం ఆగదు’ అంటూ నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను గట్టిగా వినిపించారు.
బాధితులకు ఐఎన్‌టీయూసీ సంఘీభావం
రెండో రోజు నిరసన దీక్షకు ఐఎన్‌టీయూసీ నాయకులు సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. ఐఎన్‌టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ నేతృత్వంలో నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఐఎన్‌టీయూసీ నాయకులు పితంబర్రావు (వైస్ ప్రెసిడెంట్–కార్పొరేట్), లలితా లక్ష్మి (బ్రాంచ్ సెక్రటరీ), అభిషేక్ పరమేష్ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొని బాధితులకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.
ప్రభుత్వ దృష్టికి సమస్య
ఈ సందర్భంగా పితంబర్రావు మాట్లాడుతూ.. సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను ఐఎన్‌టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ ఇప్పటికే మంత్రులు, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేసి బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరినట్లు చెప్పారు.
ప్రస్తుతం కొనసాగుతున్న కమిటీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయించి బాధితులకు న్యాయం జరిగేలా ఐఎన్‌టీయూసీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. లక్కా శ్రావణ్ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న న్యాయపోరాటంలో ఐఎన్‌టీయూసీ భాగస్వామిగా ఉంటుందని, బాధితులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసన దీక్షను కొనసాగిస్తామని వారు తెలిపారు.

Post a Comment